డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు నిన్న ఖమ్మంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై తెలంగాణాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు ఆమె పార్టీ పెట్టడంపై విరుచుకు పడుతున్నారు. పార్టీ పెడతానని చెప్పడమే కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టె హక్కు తనకు ఉందనీ.. తనను తెలంగాణ లో అడ్డుకునే వారు ఎవరినీ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఏప్రిల్ 15వ తేదీన నిరాహారదీక్ష చేస్తానని షర్మిల చెప్పడంపై కూడా తెలంగాణలోని నేతలు మండిపడుతున్నారు.
తాజాగా షర్మిల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. షర్మిల పార్టీ పెట్టుకోవాలంటే ఆంధ్రాలో పెట్టుకోవాలి కానీ, తెలంగాణలో ఎలా పెడతారని వీరయ్య ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకు లేదని అయన అన్నారు. ఇంకా పార్ట్ పెట్టనూ లేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు.. కానీ, అప్పుడే ఏప్రిల్ 15వ తేదీన నిరాహారదీక్ష అంటూ అల్టిమేట్ ఇస్తున్నారు అంటూ విమర్శించారు. మీరు అల్టిమేటం ఇవ్వాలనుకుంటే మోడీకి గానీ, జగన్ కు గానీ ఇవ్వండి. ఇక్కడ తెలంగాణలో ఇటువంటి అల్టిమేటమ్ లు నడవవు అంటూ షర్మిలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వెంకట వీరయ్య.
కాగా, శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న షర్మిల.. జులై 8వ తేదీన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. అదే రోజుల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.