పండుగవేళ బిగ్ షాక్.. ‘ఆ పనీర్’ బ్యాన్..! రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి నిషేధం!
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నాన్-డెయిరీ, కృత్రిమ పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది. సెప్టెంబర్ 10, 2026 నుండి తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నిషేధం తయారీ, ప్యాకింగ్, అమ్మకాలతో సహా అన్ని దశలకు వర్తిస్తుంది. ఏడాదిపాటు కొనసాగే ఈ చర్య, నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలను ఆకర్షిస్తుంది. ఇది సురక్షితమైన ఆహార పదార్థాల లభ్యతను నిర్ధారిస్తుంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పనీర్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది. ఏ రూపంలోనైనా పనీర్ తయారు చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, విక్రయించడంపై నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 10 నుంచే అమల్లోకి..
ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 10 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది. ఇందుకు సంబంధించి అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ నంబర్ 807 జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆహార భద్రత – ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30(2)(a) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘పనీర్’ పేరుతో అమ్మితే చర్యలు
నిషేధం కేవలం నాన్-డెయిరీ పనీర్ తయారీకి మాత్రమే పరిమితం కాదు. నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌ను ‘పనీర్’ పేరుతో తయారు చేసి విక్రయించడం, ప్యాక్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం కూడా నిషేధం పరిధిలోకి వస్తుంది. అంటే పాల ఉత్పత్తిగా గుర్తింపు పొందిన పనీర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తిని ‘పనీర్’ పేరుతో మార్కెట్ చేయడం నిషేధ ఉత్తర్వులకు విరుద్ధంగా పరిగణించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రజారోగ్యమే ప్రధాన కారణం
ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, భద్రత విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లోకి రావడంతో నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్‌ను తయారు చేసే, ప్రాసెస్ చేసే, నిల్వ చేసే లేదా విక్రయించే వ్యాపార సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా పెట్టే అవకాశం ఉంది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వ్యక్తులు, వ్యాపార సంస్థలపై ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నిషేధిత నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌ను తయారు చేయడం లేదా మార్కెట్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వ్యాపారులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అన్ని ప్రత్యామ్నాయ పనీర్ ఉత్పత్తులూ నిషేధించినట్లేనా?
అయితే ఈ నోటిఫికేషన్‌లో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ప్రత్యేకంగా ప్రమాణీకరించబడిన ఆహార ఉత్పత్తులు, వాటికి నిర్దేశించిన చట్టబద్ధమైన పేరుతో, నిర్ణయించిన ప్రమాణాలు మరియు షరతులకు అనుగుణంగా తయారు చేసి విక్రయిస్తే.. ఈ నోటిఫికేషన్‌లోని నిషేధం వాటిని నిషేధించినట్లుగా భావించకూడదని పేర్కొంది. అంటే చట్టబద్ధంగా ప్రమాణీకరించని, నిర్దేశిత పేరుతో విక్రయించే ఉత్పత్తులకు నోటిఫికేషన్ ప్రత్యేక మినహాయింపును పేర్కొంటోంది. అయితే అలాంటి ఉత్పత్తిని ‘పనీర్’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం మాత్రం నిషేధ ఉత్తర్వుల పరిధిలోకి వస్తుంది.
ఏడాది పాటు అమలు
మొత్తంగా.. తెలంగాణలో నాన్-డెయిరీ/కృత్రిమ/అనలాగ్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 10, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తయారీ నుంచి విక్రయం వరకు పలు దశల్లో నిషేధం వర్తిస్తుంది. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
