AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ - హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 7:30 PM

Share

హైదరాబాద్‌లో రాత్రిపూట ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘థర్డ్‌ షిఫ్ట్‌’ బస్సులకు భారీ స్పందన లభిస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆరు ప్రధాన రూట్లలో ప్రత్యేక నైట్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించారు. కోఠి–పటాన్‌చెరు, సికింద్రాబాద్‌–హయత్‌నగర్‌, బాచుపల్లి–వేవ్‌రాక్‌ తదితర కీలక మార్గాల్లో సర్వీసులు నడుస్తున్నాయి. మరిన్ని రూట్లకు సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్ నగరంలో రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే పెద్ద సవాలే! అర్ధరాత్రి వేళ క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్లు చెప్పే రేట్లు చూస్తే సామాన్యుల గుండెలు గుభేలుమనేది. ఐటీ ఉద్యోగులు, రాత్రి షిఫ్ట్‌లు ముగించుకుని వచ్చే కార్మికులు, ఇతర పనుల మీద లేటుగా ఇళ్లకు చేరే ప్రయాణికులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజల ఈ అవస్థను గమనించిన టీజీఎస్‌ఆర్టీసీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట ప్రయాణికుల కోసం ‘థర్డ్ షిఫ్ట్’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. నిజంగా ఇది గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద ఊరట అని చెప్పాలి! గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టి.జి.ఎస్.ఆర్టీసీ ప్రారంభించిన రాత్రిపూట బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాణికుల విజ్ఞప్తులు, రాత్రిపూట అధిక ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఆరు ప్రధాన రూట్లలో రాత్రిపూట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి భాగ్యనగరంలో ఈ రాత్రిపూట బస్సులు పట్టాలెక్కాయి. మొదటి విడతలో రద్దీ ఎక్కువగా ఉండే ఆరు ప్రధాన రూట్లలో ఈ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆ రూట్లు ఏంటో, వాటి వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోఠి నుంచి పటాన్‌చెరు వెళ్లే రూట్ నంబర్ 222A బస్సు కోసం నాలుగు బస్సులను కేటాయించి ఏకంగా పదహారు ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఈ రూట్​లో మొత్తం 4 బస్సులు ముషీరాబాద్, మియాపూర్-2 డిపోల నుంచి రెండేసి చొప్పున నడుస్తాయి. అబిడ్స్, లక్డీకాపూల్, కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ, ఉషా కిరణ్, గుట్టల బేగంపేట, కొండాపూర్ క్రాస్‌రోడ్స్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగూడ, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీని ఫ్రీక్వెన్సీ సుమారు 45 నిమిషాలుగా ఉంది. అలాగే అఫ్జల్‌గంజ్ – పటాన్‌చెరు రూట్ నం. 218, అలాగే సికింద్రాబాద్ – పటాన్‌చెరు రూట్ నం. 219 రూట్లలో రెండేసి బస్సుల చొప్పున ఎనిమిది ట్రిప్పుల పాటు ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి హయత్‌నగర్ రూట్ నం. 290U వెళ్లేందుకు మూడు బస్సులతో 14 ట్రిప్పులు, ఐటీ కారిడార్‌లో ఎంతో కీలకమైన బాచుపల్లి – వేవ్‌రాక్ రూట్ నం. 195W రూట్‌లో మూడు బస్సులతో ఏకంగా 18 ట్రిప్పులు నడుపుతున్నారు. దీని ఫ్రీక్వెన్సీ కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉండటం విశేషం. చివరగా కొండాపూర్ – సికింద్రాబాద్ రూట్ నం. 10H మార్గంలో రెండు బస్సులతో ఆరు ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ బస్సులకు ప్రజల నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది! కేవలం ఒక్క వారం రోజుల్లోనే, అంటే సరిగ్గా మొదటి ఏడు రోజుల్లోనే ఏకంగా 9,286 మంది ప్రయాణికులు ఈ రాత్రిపూట సర్వీసుల్లో ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఇంత సురక్షితమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తమ రూట్లలో కూడా రాత్రి బస్సులు నడపాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయట. ప్రజల డిమాండ్లు, ట్రాఫిక్ రద్దీని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన మార్గాల్లో ఈ థర్డ్ షిఫ్ట్ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని 24 గంటలూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్…ఖాళీగా థియేటర్లు!

TOP 9 ET News: కలెక్షన్లా.. చీవాట్లా | మరీ దారుణం600కోట్లు ఖర్చు పెడితే ఎంతొచ్చిందటే?

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!

Follow Us