Political Challenge: తొడ గొట్టిన లీడర్లు.. అభిమానుల సంబరాలు..ప్రత్యర్థుల విమర్శల బాణాలు.. ఇదో ఆధునిక రాజక్రీడ!

|

Aug 27, 2021 | 2:18 PM

తొడగొట్టి సవాల్ చేయడం ఈనాటిది కాదు. కానీ, సభ్య సమాజంలో తొడకొట్టడం అంటే.. కొంచెం ఇబ్బందికరమైన విషయంగానే చెప్పుకోవలసిన పరిస్థితి ఉంది.

Political Challenge: తొడ గొట్టిన లీడర్లు.. అభిమానుల సంబరాలు..ప్రత్యర్థుల విమర్శల బాణాలు.. ఇదో ఆధునిక రాజక్రీడ!
Political Challenges
Follow us on

Political Challenge: తొడగొట్టి సవాల్ చేయడం ఈనాటిది కాదు. కానీ, సభ్య సమాజంలో తొడకొట్టడం అంటే.. కొంచెం ఇబ్బందికరమైన విషయంగానే చెప్పుకోవలసిన పరిస్థితి ఉంది. సాధారణంగా తొడగొట్టడం అనేది చాలా అరుదుగా..జరుగుతుంది. అదీ ఇద్దరు మనుషులు బాహాబాహీ తలపడాల్సిన పరిస్థితి వచ్చినపుడు. ఎప్పటి నుంచో ఈ తొడగొట్టి సవాల్ చేయడం అనేది ఉన్నా.. అది మల్లయుద్ధం వంటి రచ్చచేసే పరిస్థితుల్లో జరిగేది. కానీ, రోజులు మారాయి. రాజకీయాలు కొత్తగా తయారు అయ్యాయి. మాటలు మీరడం.. తొడలు చరచడం ఇప్పుడు కొత్త ధోరణి.  మన నాయకులు సినిమాల్లోలా తొడలు చరిచి మరీ అవతలి వారిని ఛాలెంజ్ చేయడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

ఇటీవల అంటే.. మొన్న 25వ తేదీన తెలంగాణా మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తొడగొట్టి సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా వేడి పుట్టింది. మంత్రి తొడగొట్టడంపై రకరకాల వాదనలూ వస్తున్నాయి. అసలేం జరిగిందంటే మంత్రి మల్లారెడ్డి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానిపై స్పందిస్తూ మల్లారెడ్డి నా ఆస్తులన్నీ క్లియర్ డాక్యుమెంట్స్ తో ఉన్నాయనీ,  కాదని నిరూపించాలని మల్లారెడ్డి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు. ఇలా పబ్లిక్ లో తొడగొట్టిన ప్రజానాయకుల్లో ఈయన మొదటి వారు కాదు. ఇంతకు ముందు పలు సందర్భాలలో పలువురు ఈ పని చేశారు. ఒక్కసారి గతంలో ఇలా తొడగొట్టి సవాలు చేసిన నాయకుల గురించి చూద్దాం.

4-12-2018న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా..
చంద్రబాబు తెలంగాణలో వేలుపెడుతున్నారు. అవసరమైతే ఏపీలో మేము వేలుపెడతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందిస్తూ ‘తెలంగాణ ప్రజలు తరిమికొడితే ఆంధ్రాకే కాదు ఎక్కడికైనా పారిపోవాల్సిందే. ఆంధ్రాకు రా చూసుకుందామని తొడలు కొట్టి సవాల్ చేశారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.

ఇక ఈ తొడగొట్టుడు సీన్లు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ..
21-12-2020న గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నేతలనుద్దేశించి తొడగొట్టి సవాల్ చేశారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాలను ప్రత్యేక జిల్లా చేస్తానని చెప్పి మోసం చేశారు. వైసీపీ నేతలు ఖబడ్దార్ అని తొడగొట్టి సవాల్ చేశారు యరపతినేని. దీనికి కౌంటర్ గా దాచేపల్లిలో ఓ పిల్లోడితో తొడకొట్టించి ప్రతి సవాల్ చేశారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

17-6-2020న శాసనమండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ముదిరిపోయింది. ఈ సందర్భంగా తొడగొట్టి మరీ జగదీశ్వరరావు మీద విరుచుకు పడ్డారు మంత్రి అనిల్.

4-3-2021న.. స్థానిక ఎన్నికల సందర్బంగా..సీఎం జగన్ కు వ్యతిరేకంగా  కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
”ఓటమి చెందామని కృంగిపోకండి. అంతే ధైర్యంతో ఇప్పుడు జరగబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మన సత్తా చూపించండి. బెదిరింపులకు లోంగే పార్టీ టీడీపీ కాదని, దమ్మున్న పార్టీ అని చెప్పండి అంటూ తొడగొట్టారు బాలకృష్ణ.

3-5-2015న ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో ముష్టిపడేసి పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఎలా.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే జనం తిరగబడతారంటూ బాలకృష్ణ తొడకొట్టారు.

అక్టోబర్ 2017న.. చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవం అతిథిగా హాజరైన నటుడు బాలకృష్ణను  స్టేజ్ పై ఓ స్టంట్ చేసి చూపిస్తారా? అని వ్యాఖ్యాత సరదాగా అడుగగా.. ఓ నలుగురు స్టంట్ అసిస్టెంట్ లు స్టేజ్ పైకి రావడంతో వారితో స్టంట్ చేశాక తొడకొట్టారు బాలయ్య బాబు.

28-12-2017న..వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్న సినీ నటుడు జీవీ అలియాస్ జీవీ సుధాకర్ నాయుడు
వంగవీటి రంగా 29వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుల రాజకీయాలు వద్దని చెప్పిన వ్యక్తి రంగా అంటూ తొడకొట్టారు జీవీ నాయుడు

2009లో ఎన్నికల ప్రచారంలో కడపకు వెళ్ళి మరీ..తొడగొట్టి, మీసం మెలేసి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. ఆవేశాన్ని అణుచుకోలేకపోవడం.. తమ ముందున్న ప్రజలలో ఎమోషన్ తెప్పించడమే ఈ తొడకొట్టుడు కార్యక్రమానికి వెనుక ఉన్న రహస్యం అనేది పై సంఘటనలు చెబుతున్నాయి.

Also Read: Tadipatri: కొద్దిగా గ్యాప్ వచ్చినాది అప్పా.. మళ్లీ రచ్చ షురూ.. రంజుగా తాడిపత్రి రాజకీయం

Dalitha Bandhu: దేశానికే ఆదర్శం దళితబంధు పథకం.. లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రులు..