లాంగ్ మార్చ్‌తో సత్తా చాటిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా ? ఆయన కార్యాచరణ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. లాంగ్ మార్చ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో జనం తరలి రావడంతో విశాఖలో జనసేన సైన్యం సముద్రాన్ని తలపించింది. అందులో పాల్గొన్న టిడిపి నేతం సైతం ప్రజాస్పందనను చూసి ఆశ్చర్యచకితులయ్యారంటే లాంగ్ మార్చ్ ఎంతగా సక్సెస్సయ్యిందో తెలుసుకోవచ్చు. అయితే.. ఈ సక్సెస్‌ను కొనసాగించి.. ఏపీలో బలమైన పార్టీగా ఎదిగేందుకు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖ శివార్లలోని గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. అదే చోట లాంగ్ మార్చ్ నిర్వహించాలని అత్యంత వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. ఓడిపోయిన చోటే తన బలమేంటో తెలియచెప్పాలన్నదే జనసేనాని అభిమతమని అనుకున్నారంతా. 6 నెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైన పవన్ కల్యాణ్ స్వయంగా తాను ఓడిపోయిన నగరంలోనే తన బలమేంటో చాటుకున్నారు.
అయితే.. లాంగ్ మార్చ్‌కు ఊహించిన దాని కంటే ఎక్కువగా జనం తరలి రావడంతో జనసేన పార్టీ నేతలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అప్పట్నించి జనసేన ద్విముఖ వ్యూహం అమల్లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ద్విముఖ వ్యూహం ప్రకారం బిజెపి, టిడిపిలకు సమాన దూరంలో వుంటూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడమే పవన్ కల్యాణ్ అభిమతమని అంటున్నారు.
నిజానికి లాంగ్ మార్చి వేదిక నుంచే పవన్ కల్యాణ్ తన భవిష్యత్ వ్యూహాన్ని చూఛాయగా చాటారు. ఢిల్లీతో విభేదాలేమీ లేవని, బిజెపి బద్ద శతృత్వం ఏమీ లేదని చెప్పారు. తన లాంగ్ మార్చ్‌కు బిజెపి రాలేదన్న విషయాన్ని ఆయన విస్మరించకుండానే బిజెపికి సిగ్నల్స్ పంపారు. అదే సమయంలో టిడిపితో మితిమీరిన బంధమేదీ లేదని చెప్పేశారు. పరిస్థితికి అనుగుణంగా విపక్షాలను కలుపుకొని పోవడమే ప్రస్తుతానికి జనసేన నిర్ణయమని చెప్పుకొచ్చారు.
ఒకవైపు టిడిపి వీక్ అవుతుండడం.. బిజెపికి బలం పెరుగుతుండడం.. ఇవన్నీ గమనిస్తున్న జనసేన థింక్ ట్యాంక్.. 2024 ఎన్నికల దాకా ఇదే వైఖరి కొనసాగించి.. అప్పటి పరిస్థితికి అనుగుణంగా ఎవరితో కలవాలనేది నిర్ణయించుకోవచ్చని భావిస్తోందని సమాచారం. టిడిపి బలం పెరిగితే.. రాష్ట్రంలో ఇరుపార్టీలు లాభపడడంతోపాటు.. కేంద్రంలో ఎంతో కొంత ప్రభావం చూపే స్థాయిలో ఉమ్మడి ఎంపీలను పంపొచ్చన్నది ఒక వ్యూహం కాగా.. ఒకవేళ టిడిపి కునారిల్లిపోతే.. బిజెపి పుంజుకున్న పరిస్థితి కనిపిస్తే.. బిజెపితో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో బెనిఫిట్ అయితే.. ముఖ్యమంత్రి పీఠం తాను కైవసం చేసుకుని.. కేంద్రంలో బిజెపికి తన ఎంపీల మద్దతు ఇవ్వొచ్చన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశమని అంటున్నారు.
ఎలాగో బిజెపికి సౌత్‌లో ఓ చెప్పుకోదగిన మిత్రపక్షం కావాలి కాబట్టి ఆ స్థానాన్నితాను, తమ జనసేన పూడుస్తాయన్నది పవర్ స్టార్ వ్యూహమని చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా.. 2024 ఎన్నికలు.. వైసీపీ-టిడిపి/జనసేన మధ్యా లేక వైసీపీ-జనసేన/బిజెపి మధ్యా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.