కేటీఆర్‌ వర్సెస్‌ రామంచంద్రరావు.. ఒకరు గ్యాస్‌ సిలిండర్‌కు.. మరొకరు నిరుద్యోగికి మొక్కుబడులు.. ఓటర్లు మాత్రం..

|

Mar 14, 2021 | 11:50 AM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు..

కేటీఆర్‌ వర్సెస్‌ రామంచంద్రరావు.. ఒకరు గ్యాస్‌ సిలిండర్‌కు.. మరొకరు నిరుద్యోగికి మొక్కుబడులు.. ఓటర్లు మాత్రం..
Ktr Vs Ramchandar Rao
Follow us on

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖులు సైతం తమ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

అయితే పోలింగ్‌ వేళ నేతల మొక్కుబడి సిత్రాలు ఆసక్తిగా మారాయి. హైద‌రాబాద్‌, షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే తాను ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తెలిపారు. ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయ‌న అన్నారు. ఆదివారం సెలవుదినమని ఇంట్లోనే ఉండ‌కూడ‌ద‌ని, ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌పై సెటైర్ వేశారు. ఓయూ నిరుద్యోగి ఎల్లస్వామికి మొక్కి ఎమ్మెల్సీ ఓటు వేశానని కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ త్వరగా రావాలని దేవుడికి మొక్కుకొని పోలింగ్ సెంటర్‌కు వచ్చానని రాంచంద్రరావు వ్యాఖ్యానించారు.  ఓ మహానుభావుడు చెప్పినట్టు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు నమస్తే పెట్టి ఓటేసేందుకు బయలుదేరానని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇద్దరి నేతలకు కౌంటర్‌గా అన్నట్లు సోషల్‌ మీడియాలో ఓటర్ల కామెంట్స్‌ మరింత ఆసక్తిగా మారాయి. మీరేమో కానీ మేము మాత్రం పెట్రోల్‌ బంక్‌లకు మొక్కి ఓటేశామని ఓటర్లు కామెంట్లు చేయడం వైరల్‌గా మారింది. మొత్తానికి అటు నేతలు, ఇటు ఓటర్ల మొక్కుబడి సిత్రాలు పోలింగ్‌వేళ చర్చనీయాంశంగా మారాయి.