Andhra Pradesh: ఏమో.. గుర్రం గాల్లో ఎగరావచ్చు..! వైసీపీలోని ఆ నేతల్లో దింపుడు కళ్లెం ఆశలు

ఏమో.. గుర్రం గాల్లో ఎగరావచ్చు.. అధిష్టానం మనసు మారావచ్చు.. అంటూ అట్నుంచి నరుక్కొస్తున్నారు కొందరు వైసీపీ సిట్టింగులు. మార్పులు-చేర్పుల పర్యవసానాల్లో భాగంగా.. కొన్నిచోట్ల.. సైలెంట్‌గా రెబల్ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా రెండునెలలుంది.. ఇంకాస్త కష్టపడితే హైకమాండ్ మనసులో స్థానం సంపాదించలేమా.. బీఫారమ్ తెప్పించుకోలేమా.. ఇదీ వీళ్లకుండే చివరాఖరి దింపుడు కళ్లెం ఆశ.

Andhra Pradesh: ఏమో.. గుర్రం గాల్లో ఎగరావచ్చు..! వైసీపీలోని ఆ నేతల్లో దింపుడు కళ్లెం ఆశలు
YS Jagan

Updated on: Jan 13, 2024 | 10:41 AM

ఏమో.. గుర్రం గాల్లో ఎగరావచ్చు.. అధిష్టానం మనసు మారావచ్చు.. అంటూ అట్నుంచి నరుక్కొస్తున్నారు కొందరు వైసీపీ సిట్టింగులు. మార్పులు-చేర్పుల పర్యవసానాల్లో భాగంగా.. కొన్నిచోట్ల.. సైలెంట్‌గా రెబల్ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా రెండునెలలుంది.. ఇంకాస్త కష్టపడితే హైకమాండ్ మనసులో స్థానం సంపాదించలేమా.. బీఫారమ్ తెప్పించుకోలేమా.. ఇదీ వీళ్లకుండే చివరాఖరి దింపుడు కళ్లెం ఆశ.. మూడు దశల్లో 59మందికి టికెట్లు ఖరారు చేసిన వైసీపీలో.. లాస్ట్‌ మినిట్ ఛేంజెస్ తప్పవన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోయినా ఆఖరి ఆశలతో ఊగిసలాడుతున్నారు కొందరు నేతలు. పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అరకు నియోజకవర్గాల్లో అధిష్టానం ఆలోచనకు భిన్నంగా నడుస్తోంది స్థానిక నాయకత్వం. ఇన్‌చార్జ్‌లు వేరు, బీఫారమ్ వేరు అనే ధీమా వీళ్లలో ధైర్యం నింపుతోందా?

పిఠాపురం వైసీపీ టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ఆ స్థానంలో వంగా గీతను ఇన్‌చార్జ్‌గా నియమించింది అధిష్టానం. కానీ.. ఇన్‌చార్జ్‌లు, కోఆర్డినేటర్లందరూ అభ్యర్థులు కాబోరంటున్న దొరబాబు.. హైకమాండ్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో జోష్‌గా పాల్గొన్నారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. క్యాడర్ నాతోనే ఉంది.. ప్రజల ఆకాంక్ష ప్రకారం తనకు జగన్ అవకాశం ఇచ్చే తీరతారు అంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

అటు.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ మార్పులు-చేర్పుల కాక మొదలైంది. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు టికెట్ నిరాకరించింది అధిష్టానం. ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుని ఇన్‌చార్జిగా పంపించారు. దీన్ని దిగమింగుకోలేని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైలెంట్‌గా తిరుగుబాటు మొదలుపెట్టారు. వరుపుల సుబ్బారావుకి సహాయ నిరాకరణ ప్రకటించి.. ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లాలని డిసైడయ్యారు. హైకమాండ్‌ మనసులో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

ఒంగోలు ఎంపీ నియోజకవర్గంపై సస్పెన్స్ పీక్స్‌లో నడుస్తోంది. మూడో జాబితాతోనే ఈ ఉత్కంఠకు తెర పడుతుందనుకున్నారు. కానీ.. జరగలేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టిక్కెట్ నిరాకరించవచ్చన్న వార్తలతో.. ఆ దిశగా లాబీయింగ్ షురూ ఐంది. బాలినేని ద్వారా పావులు కదుపుతోంది మాగుంట వర్గం. సిట్టింగ్‌ను మార్చవద్దని, మాగుంటను మళ్లీ గెలిపించుకుంటామని అధిష్టానం దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి బాలినేని.

కర్నూలు ఎంపీ టికెట్ దక్కించుకున్న ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కూడా అధిష్టానం నిర్ణయంతో పూర్తిగా సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేగా పోటీలో ఉండడమే తమ అభిమతమని చెబుతున్నారు. ఇంకా రెండునెలల టైముంది.., చూద్దాం ఏం జరుగుతుందో.. బీఫారమ్ దాకా లెటజ్ వెయిట్ అండ్ సీ అంటున్నారు.

వైసీపీ థర్డ్ లిస్ట్‌లో.. అరకు ఇన్‌చార్జ్‌గా గొడ్డేటి మాధవి పేరు ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న మాధవిని.. అరకు ఎమ్మెల్యే సెగ్మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ.. ఆమెకు సహకరించేది లేదని తేల్చేశారు సిట్టింగ్‌ చెట్టి ఫాల్గుణ. ఎమ్మెల్యేకి మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి ‘మాధవి గోబ్యాక్’ అంటూ నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు. టిక్కెట్ కోసం చివరి క్షణం వరకు పోరాడతానని ఓపెన్‌గా చెబుతున్నారు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ. వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి.. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా.. అధిష్టానం నుంచి ఇన్‌చార్జిల జాబితా రిలీజవుతున్నా, స్థానికంగా మాత్రం కొన్నిచోట్ల వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు నేతలు. ఏమో.. అధిష్టానం మనసు మారినా మారవచ్చు అంటూ దింపుడుకళ్లెం ఆశలతో ముందుకెళ్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..