BRS Party: ఖమ్మంలో అదరగొట్టాం.. ఇక నెక్స్టేంటి? గులాబీ శ్రేణులకు సూపర్ లీక్ ఇచ్చిన కేసీఆర్.. రెండో సభ ఆ రాష్ట్రంలోనే!

|

Jan 20, 2023 | 9:05 PM

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మం బహిరంగ సభను నిర్వహించిన తర్వాత భారత రాష్ట్ర సమితి తదుపరి కార్యక్రమం ఏంటి అన్న చర్చ మొదలయింది.

BRS Party: ఖమ్మంలో అదరగొట్టాం.. ఇక నెక్స్టేంటి? గులాబీ శ్రేణులకు సూపర్ లీక్ ఇచ్చిన కేసీఆర్.. రెండో సభ ఆ రాష్ట్రంలోనే!
Brs Khammam Meeting
Follow us on

నెక్స్ట్ ఏంటి? ఏదైనా తలపెట్టిన పని పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకునే ప్రశ్న ఇది. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మం బహిరంగ సభను నిర్వహించిన తర్వాత భారత రాష్ట్ర సమితి తదుపరి కార్యక్రమం ఏంటి అన్న చర్చ మొదలయింది. జనవరి 18వ తేదీన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి అటెండ్ అయిన ఖమ్మం బహిరంగ సభ తర్వాత భారత రాష్ట్ర సమితి శ్రేణుల మదుల్లో మెదులుతున్న ప్రశ్న కూడా ఇదే. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి బహిరంగ సభ ఎక్కడ పెడతారు అన్న చర్చ ఒక నెల రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ వేదిక ఖరారయింది. తెలంగాణ, ఏపీలకు అనుసంధానంగా ఉన్న.. ప్రస్తుతం రాజకీయ పార్టీల కదలికలతో కీలకంగా మారిన ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అత్యంత వ్యూహాత్మకంగా తొలి బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ఖరారు చేశారు. జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో పార్టీకి ఒక కొత్త రూపు తెచ్చేందుకు పలువురు జాతీయ స్థాయి నాయకులను ఈ సభకు రప్పించాలని తలపెట్టారు కేసీఆర్. అనుకున్నట్లుగానే కేరళ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు, సిపిఎం నేత పినరయి విజయన్ ఖమ్మం సభకు హాజరయ్యారు. విజయన్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఖమ్మం సభకు హాజరయ్యారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు అతిథిగా హాజరయ్యారు. ఎప్పుడు రాజకీయ పొత్తుల కోసం తహతహలాడే సిపిఐ పార్టీ తరఫున రాజా కెసిఆర్‌తో వేదికను పంచుకున్నారు. నిజానికి ఉభయ వామపక్షాలకు ఖమ్మం జిల్లా ఎంతో కీలకం. ఒకప్పుడు జిల్లాలో పరస్పరం తన్నుకులాడిన.. ఇప్పుడు పరస్పరం స్నేహంతో కొనసాగుతున్న వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తమకున్న ఓటు బ్యాంకును వినియోగించుకొని మళ్లీ శాసనసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. దానికి కెసిఆర్‌తో ఫ్రెండ్షిప్ అవసరమని భావించిన ఉభయ వామపక్షాలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గులాబీ పార్టీకి దగ్గరయ్యాయి. మునుగోడుకు కొనసాగింపుగా ఖమ్మం బహిరంగ సభకు కూడా వామపక్షాల నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కేసీఆర్ పార్టీకి సంఘీభావం ప్రకటించారు. భారీగా తరలివచ్చిన గులాబీ దండుతో ఖమ్మం సభ విజయవంతం అయింది. ఆ తర్వాతే కొత్త చర్చ మొదలయ్యింది అదే నెక్స్ట్ ఏంటి?

వైజాగా? బెజవాడా? తేలేదెప్పుడు?

ఖమ్మం సభకు కొన్ని రోజుల ముందుగా కేసిఆర్ తన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు పార్టీల తరఫున ఎంపీగాను, ఎమ్మెల్యే గాను పోటీ చేసి ఓడిపోయిన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ని బీఆర్ఎస్ ఏపీ యూనిట్ అధ్యక్షునిగా ప్రకటించారు. తోట చంద్రశేఖర్ తో పాటు పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వంటి వారికి ఏపీలో గులాబీ పార్టీని విస్తరించే బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. ఆనాటి నుంచి ఏపీలోని విజయవాడ లేదా విశాఖపట్నంలో కేసీఆర్ పార్టీ బహిరంగ సభను నిర్వహించబోతోంది అన్న కథనాలు రావడం మొదలయింది. ఇప్పుడు తాజాగా ఖమ్మం సభ ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీ రెండో సభ ఏపీలో నిర్వహించే అవకాశం ఉంది అన్న అభిప్రాయం పలువురి నోటి వెంట వినిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీని మరింతగా విస్తరించేందుకు గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఖమ్మం ఆవిర్భావ సభ సక్సెస్ అవడంతో అదే ఊపులో ఇతర రాష్ట్రాల్లోనూ సభలు నిర్వహించి పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయాలని కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నం లేదా విజయవాడలో భారీ బహిరంగ సభకు కేసిఆర్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. విజయవాడ కంటే విశాఖపట్నంలో సభ నిర్వహించేందుకే కేసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు తాజాగా తెలుస్తోంది. వైజాగ్‌లో గనక సభ వేదిక ఖరారు అయితే అటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసే అవకాశం ఉందని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసుకుని రావాలని ఏపీ యూనిట్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులకు కేసీఆర్ సూచించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వారి నుంచి ప్రాథమిక నివేదిక అందిన తర్వాత సభ నిర్వహించే సిటీని ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఉన్న సమాచారం ప్రకారం విజయవాడ కంటే వైజాగ్‌లోనే కెసిఆర్ పార్టీ తదుపరి బహిరంగ సభ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరఠ్వాడాపై కసరత్తు షురూ

ఇక మహారాష్ట్రలోను బీఆర్ఎస్ విస్తరణకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనవరి 19వ తేదీన కొంతమంది మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, రైతు నాయకులు, కొన్ని ప్రజాసంఘాల ప్రతినిధులు కేసీఆర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న తెలుగువారు.. మరీ ముఖ్యంగా తెలంగాణ మూలాలు ఉన్నవారు తమకు తాముగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే చాలామంది కెసిఆర్‌ను కలిశారని జాతీయ రాజకీయాలే లక్ష్యంగా మరి ముఖ్యంగా బిజెపి ఓటమి కర్తవ్యంగా ముందుకు వెళుతున్న కేసిఆర్‌కు వారంతా సంఘీభావం తెలిపారని గులాబీ దళాలు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్రలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని సూచించాలని తనను కలిసిన మహారాష్ట్ర నేతలను కెసిఆర్ కోరినట్లు తెలుస్తోంది. తెలుగువారు మరి ముఖ్యంగా తెలంగాణ వారు అధికంగా ఉన్న నాందేడ్ లేదా గడ్చిరోలి జిల్లాల పరిధిలో ఏదో ఒకచోట బహిరంగ సభను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గడ్చిరోలిలో నక్సల్స్ ప్రభావం ఉన్నందున నాందేడ్ లోనే సభ నిర్వహణకు ఎక్కువ అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలోని నిజామాబాద్‌కు పొరుగున ఉండే నాందేడ్‌లో బహిరంగ సభ ప్లాన్ చేస్తే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా గులాబీ శ్రేణులను తరలించవచ్చని.. దాంతో సభ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ సభ తర్వాత మహారాష్ట్రలో చత్రపతి శివాజీ స్వస్థలం సహా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనాలతో భారీగా ర్యాలీలు నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో బహిరంగ సభ ఏర్పాటుకు ముందే ఆ రాష్ట్ర పార్టీ యూనిట్ అధ్యక్షుడిని, కొంతమందితో కార్యవర్గాన్ని కూడా ఖరారు చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సభ ఏర్పాటు చేసే లోగానే మహారాష్ట్రలో నెలకొన్న ప్రధాన సమస్యలు, అక్కడి ప్రజల డిమాండ్లు, వారి ఆకాంక్షలు తెలుసుకొని వాటికనుగుణంగా ఆ రాష్ట్ర పార్టీ ఎజెండాను ఖరారు చేయాలని.. బహిరంగ సభ వేదిక నుంచి వాటిని ప్రకటించాలని తలపెట్టినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించే లక్ష్యంతో ఉచిత విద్యుత్తు లాంటి పథకాలను మహారాష్ట్ర బహిరంగ సభ వేదికగా ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా జాతీయస్థాయిలో రాజకీయాల్లో పెను మార్పుకు శ్రీకారం చుట్టవచ్చని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ బాధ్యతలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా ఆయన గతంలో మహారాష్ట్రలో నిర్వహించిన వ్యాపారాలలో భాగస్వాములను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద భారత రాష్ట్ర సమితి తదుపరి బహిరంగ సభ ఆంధ్ర ప్రదేశ్‌లో.. ఆ తర్వాత మూడో బహిరంగ సభ మహారాష్ట్రలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.