కోల్‌బెల్ట్ ఏరియాలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్ పర్యటిస్తున్నారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. తరుణ్‌చుగ్ తన పర్యటనలో భాగంగా టీఆర్‌ఎస్‌ని, తెలంగాణ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ కోరతామన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితని కూడా పర్సనల్‌గా టార్గెట్ చేశారు తరుణ్‌చుగ్. దీనిపై టీఆర్‌ఎస్ నేతలనుంచి రియాక్షన్ మొదలైంది.
యూనియన్ లీడర్‌గా సింగరేణి కాలరీస్‌ని కవిత తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు తరుణ్‌చుగ్. దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి నివేదిస్తామన్నారు. దోషులకు శిక్షపడకుండా వదిలిపెట్టబోమన్నారు తరుణ్‌చుగ్.
తరుణ్‌చుగ్ వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. కవితపై తరుణ్‌చుగ్ వ్యాఖ్యలను ఖండించారు. కవిత వచ్చాకే సింగరేణికి పూర్వ వైభవం వచ్చిందని, రాజకీయ అరాచకాలు తగ్గాయన్నారు షకీల్. నిఘాసంస్థలు తమ జేబులో ఉన్నట్లు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని, దమ్ముంటే అవినీతి ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇక తరుణ్‌చుగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు చెన్నూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. బీజేపీ నేతల పరిస్థితి కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లే ఉందన్నారు. బండి సంజయ్ బుడ్డర్‌ఖాన్ మాటలు మాని..చేతనైతే సింగరేణి కార్మికులకు మేలు చేయాలన్నారు బాల్క సుమన్.