ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ.. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి.. వాటికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక.. అమరావతి ముంపు ప్రాంతమని.. అది రాజధానిగా.. ఉండటం నష్టమని.. జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో.. ప్రకాశం జిల్లాలోని ‘దొనకొండ’ పేరు తెరపైకి వచ్చింది. దొనకొండనే ఏపీ రాజధానికి అనువైన స్థలమని.. అందుకే అక్కడ వైసీపీ నేతలు కొందరు భూములు కొంటున్నారనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో.. దొనకొండలో నిన్నమొన్నటి వరకూ.. ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండేది. కానీ.. ఇప్పుడు.. అక్కడ ఎకరం భూమి ధర ఏకంగా కోటి రూపాయలయి కూర్చుంది. ఏపీ రాజధాని దొనకొండనే అనే హైప్ రావడంతో.. అక్కడ ఒక్కసారిగా.. భూమి ధరలు చుక్కలనంటుతున్నాయి. దొనకొండ చుట్టుపక్కల 250 ఎకరాల్లో 55 వెంచర్లు వెలిశాయి. ఇప్పటికే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రాజధాని మార్పుపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో కానీ.. ప్రస్తుతం దొనకొండలో మాత్రం భూం.. భూం నడుస్తోంది.