
దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. విగ్రహ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించనుంది.

ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విగ్రహానికి కళాకారులు తుది మెరుగులు దిద్దుతూ చివరి దశ పనులు చకాచకా చేస్తున్నారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. తెలంగాణకే మణిహారంగా నిలవనుంది. అంబేద్కర్ విగ్రహం.. ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని.. కుడి చేతిని ముందుకు చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న బాబాసాహెబ్ విగ్రహం నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు అమరుల స్మారకం.. అంబేడ్కర్ భారీ విగ్రహం.. హైదరాబాద్ కు మణిహారంగా నిలవనున్నాయి.

కాగా.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా.. 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. దీనికోసం నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ పార్కు పక్కన 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించి భూమి పూజ చేశారు. ఏడాది వ్యవధిలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఆరేళ్ల సమయం పట్టింది.

ఈ విగ్రహం 155 టన్నుల స్టీల్.. 111 టన్నుల కంచుతో రూపొందించారు. సుమారు రూ.146 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉండగా.. కింద పార్లమెంటు ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది.