
మన భారతదేశం సాంస్కృతిక, సహజ వైవిధ్యంతో నిండి ఉంది. అందువల్ల పండుగలు, సంప్రదాయాల ప్రత్యేక సంగమం ఇక్కడ కనిపిస్తుంది. ఇదే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది. మన దేశం విభిన్న సంస్కృతి, భౌగోళిక స్థానం కూడా విదేశీయులను ఆకర్షిస్తుంది. మన దేశంలో పండుగలు కేవలం మత ప్రాతిపదికన మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో వాతావరణానికి అనుగుణంగా పండగలు జరుపుకుంటారు. శీతాకాలంలో కూడా ప్రత్యేక రకాల పండుగలు జరుపుకుంటారు. ఈ వింటర్ ఫెస్టివల్ లో పాల్గొనడం ఎవరికైనా గుర్తుండిపోతుంది. దీనితో పాటు దేశంలోని విభిన్న సంస్కృతులను తెలుసుకునేందుకు కూడా ఇదొక మంచి అవకాశం.

శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ పండుగలలో భాగమై శీతాకాలాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. చలికాలంలో మెత్తని బెడ్ షీట్ కింద చలి నుంచి ఉపశమనం పొందే బదులు వింటర్ సీజన్ స్పెషల్ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. అదే సమయంలో ఆ ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. కనుక శీతాకాలంలో స్పెషల్ ఉత్సవాలు జరుపుకునే దేశాల గురించి ఈ రోజుతెలుసుకుందాం..

రణ్ ఉత్సవం: భారతదేశంలోని గుజరాత్ అనేక విధాలుగా ప్రత్యేకమైనది. కళ, ఫెయిర్, హస్తకళలు, వాణిజ్యం, ఆహార పదార్ధాలు, పండుగలు, దుస్తులు.. గుజరాత్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్‌ని ఒకసారి చూడాలి. శీతాకాలంలో ఇక్కడ రణ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ గర్బా, దాండియా వంటి సాంప్రదాయక మనోహరమైన జానపద నృత్యాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు హస్తకళా వస్తువులను చూడవచ్చు. పాక్ గుజరాత్‌లోని ఉంధియు, దోక్లా మొదలైన సాంప్రదాయ వంటకాలను కూడా రుచి చూడవచ్చు. అంతే కాకుండా రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూడటం ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. రణ్ కచ్ ఉత్సవం నవంబర్ , మార్చి నెలల మధ్య జరుగుతుంది.

హిమాచల్ వింటర్ కార్నివాల్: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, సిమ్లా లతో పాటు ఇతర హిల్ స్టేషన్‌లు శీతాకాలంలో స్వర్గధామంగా మారతాయి. వింటర్ సీజన్ లో పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. ఇక్కడ శీతాకాలపు కార్నివాల్‌లో పాల్గొనవచ్చు. ఇందులో స్కీయింగ్ పోటీ, ఫుట్ రైడింగ్, వీధి నాటకం, సాంప్రదాయ ఆహారం, హిమాచల్ సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది. మనాలిని సందర్శిస్తే గొప్ప అనుభూతినిస్తుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య మీరు హిమాచల్ వింటర్ కార్నివాల్‌కు హాజరు కావచ్చు

హార్న్‌బిల్ ఫెస్టివల్ కోహిమా: చలికాలంలోనాగాలాండ్‌లోని కొహిమాలో జరిగే హార్న్‌బిల్ ఫెస్టివల్‌కు హాజరు అవ్వడం ఒక మరుపురాని జ్ఞాపకంగా మారుతుంది. దీనిని పండుగల పండుగ అని పిలుస్తారు. ఈ పండుగలో నాగాలాండ్‌లో నివసిస్తున్న గిరిజనుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే అవకాశం లభిస్తుంది. ఈ పండుగలో సంప్రదాయ సంగీతం, నృత్యం, ఆటలను చూడవచ్చు. అంతేకాదు ప్రత్యేకమైన గిరిజన వంటకాల రుచి ఎవరినైనా మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది. ఇక్కడ జరిగే జానపద నృత్యం, కుస్తీ పోటీ, విలువిద్య మొదలైన వేడుకలలో కూడా పాల్గొనవచ్చు. అందువల్ల శీతాకాలంలో జరిగే ఈ పండుగను మిస్ చేయవద్దు.

జైసల్మేర్ ఎడారి పండుగ: చలికాలంలో రాజస్థాన్‌కు వెళ్లడం చాలా ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. శీతాకాలంలో రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో నిర్వహించే జైసల్మేర్ ఎడారి ఉత్సవంలో పాల్గొనడం అద్భుతమైన అనుభవం. ఈ పండుగలో మీరు ఒంటెల పందాలు, జానపద సంగీతం , జానపద నృత్యాలతో పాటు తోలుబొమ్మల ప్రదర్శనలను చూడవచ్చు. రంగురంగుల దుస్తులు ధరించిన ఒంటెలు లయబద్ధంగా నృత్యం చేయడం ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం. అంతేకాదు తలపాగా చుట్టడం వంటి కొన్ని ప్రత్యేకమైన పోటీలు కూడా ఈ ఉత్సవాల్లో నిర్వహిస్తారు. వీటిలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇక ఈ ఎడారి పండగలో రాజస్థాన్ విలక్షణమైన వంటకాలను రుచి చూడటం మర్చిపోవద్దు. ఈ పండుగను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.

సోన్‌పూర్ ఫెయిర్: పింక్ చలికాలంలో అంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య బీహార్‌లోని సోన్‌పూర్‌లో జరిగే సోన్‌పూర్ ఫెయిర్‌కు వెళ్లవచ్చు. ఈ ఫెయిర్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. సోన్‌పూర్ జాతరను ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతర అంటారు. విదేశీ పర్యాటకులు కూడా ఈ ఉత్సవాన్ని సందర్శించడానికి వస్తారు. ఈ పశువుల జాతర చరిత్ర కూడా చాలా పురాతనం. గండక్, గంగా నదుల సంగమ ప్రదేశంలో నిర్వహించే ఈ జాతరలో భాగం కావడం ఎవరికైనా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.