
పండ్లలో రాజా మామిడి పండు. దీని తియ్యని రుచికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే మామిడి పండు తినే విషయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం తర్వాత మామిడి పండు తినే అలవాటు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

భోజనం తర్వాత ఎందుకు వద్దు:చాలామంది భోజనం ముగించాక డెజర్ట్‌గా మామిడి పండును తింటారు. కానీ ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు భోజనం తర్వాత వెంటనే మామిడి పండు తింటే అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.100 గ్రాముల మామిడి పండులో 60 కిలో కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు సుమారు 14 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. భోజనంతో పాటు ఈ కేలరీలు కూడా చేరడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

ఎప్పుడు తినడం ఉత్తమం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేయడానికి 30 నుండి 60 నిమిషాల ముందు మామిడి పండు తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. భోజనం తర్వాత తినాలనుకుంటే.. కచ్చితంగా 1.5 నుండి 2 గంటల విరామం పాటించాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు.

ఈ తప్పులు అస్సలు చేయకండి: మామిడి మిల్క్‌షేక్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పుల్లని పండ్లను పాలతో కలిపి తీసుకోవడం విరుద్ధాహారం కిందకు వస్తుంది. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. పడుకునే ముందు మామిడి పండు తింటే అందులోని చక్కెర శక్తిని విడుదల చేస్తుంది, దీనివల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పరిమితి ముఖ్యం: మామిడి పండులో విటమిన్ A, C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, మామిడిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల పండులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, వేడి చేయకుండా ఉంటుంది.