
వడ, గారెలు.. వీటి గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ వంటకాలు చాలా ఫేమస్. సాంబార్ లేదా చట్నీ కాంబినేషన్‌తో తినే వడ పైన క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటుంది. చాలా మంది అల్పాహారంగా వడ సాంబార్ తినడానికి ఇష్టపడతారు. చిన్న స్టాల్స్ నుండి పెద్ద హోటళ్ల వరకు ఈ వంటకం ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది.

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ వంటకాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ వడ మధ్యలో చిన్న రంధ్రం ఎందుకు ఉంది? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం..

వడలను మినపప్పుతో తయారు చేస్తారు. మినపప్పును కడిగి, నానబెట్టి, మందపాటి పేస్ట్ లాగా రుబ్బుతారు. ఆ తరువాత దానినిలో రుచి కోసం రకరకాల పదార్ధాలు కలిపి వడ ఆకారంలో నూనెలో వేయించాలి. అయితే వడ తయారుచేసేటప్పుడు మధ్యలో ఒక చిన్న రంధ్రం వేలుతో చేస్తారు.

ఇలా మధ్యలో ఒక రంధ్రం ఉన్నందున వడ లోపలి నుండి బాగా వేయించబడుతుంది. మధ్యలో రంధ్రం లేకపోతే వడ లోపలి నుండి పచ్చిగా ఉండే అవకాశం ఉంది. వడ మధ్యలో ఉన్న రంధ్రం కారణంగా వడను నూనెలో వేసినప్పుడు అది వడ లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల వడ లోపలి నుంచి బాగా ఉడికి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఫలితంగా పర్ఫెక్ట్ వడ తయారవుతుంది. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటుంది. ఇది దాని రుచిని మరింత పెంచుతుంది.

శాస్త్రీయంగా వడ మధ్యలో ఉన్న ఈ రంధ్రంకి ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే ఈ రంధ్రం వడ ఉపరితల వైశాల్యంలో ఎక్కువ భాగాన్ని నూనెతో తాకడానికి ఉపయోగపడుతుంది. ఇది వేగంగా ఉడికిపోతుంది. పైగా తక్కువ నూనెను గ్రహిస్తుంది. వడలో రంధ్రాలు లేదా చిల్లులు లేకపోతే అది వేయించడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. వడ ఎక్కువ నూనె పీల్చుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.