
శీతాకాలంలో కొంతమందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. ఇలా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చల్లని గాలి మెదడులోని నరాలను కుదిస్తుంది. దీని వల్ల తలనొప్పి రావడం సాధారణంగా జరుగుతుంది. ఎక్కువసేపు చలిలో ఉండటం వల్ల నొప్పి పెరుగుతుంది. శీతాకాలంలో గాలి పొడిగా ఉంటుంది. దీంతో ఈ కాలంలో తక్కువ నీళ్లు తాగుతుంటారు. దీనివల్ల డీహైడ్రేషన్, మెదడు, నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతె తలనొప్పి వస్తుంది. అందువల్ల తగినంత నీళ్లు తాగడం ముఖ్యం.

శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీనివల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా తలనొప్పి, అలసట వస్తుంది. కాబట్టి కొంత సమయం ఎండలో గడపాలి.

శీతాకాలంలో నిద్ర, దినచర్యకు అంతరాయం ఏర్పడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. ప్రతి సీజన్‌లో క్రమం తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఎంత ఒత్తిడితో కూడిన పని లేదా ఇతర విషయాలు ఉన్నా తగినంత నిద్ర పోవాలి.

అసమతుల్య ఆహారం, అధిక కెఫిన్ కూడా తలనొప్పికి కారణమవుతాయి. కాబట్టి శీతాకాలంలో మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తేలికైన,పోషకమైన భోజనం తినాలి. రోజు వారీ అలవాట్లలో కాఫీ, టీల ద్వారా తీసుకునే కెఫిన్ తీసుకోవడం పరిమితం చేస్తే మరీ మంచిది.

శీతాకాలంలో తలనొప్పి తగ్గాలంటే మరిన్ని నీళ్లు తాగాలి. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి. తేలికైన ఆహారం తీసుకోవాలి. జలుబు కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఏ విషయానికి ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదు.