
కిడ్నీలో రాళ్ల సమస్య: బీట్‌రూట్‌లో ఆక్సలేట్లు అత్యధికంగా ఉంటాయి. అమెరికాకు చెందిన నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. ఈ ఆక్సలేట్లు శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా రాళ్లు పడే స్వభావం ఉన్నవారు ఈ జ్యూస్‌కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

లో-బీపీ బాధితులకు ప్రమాదం: బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తపోటును తగ్గిస్తాయి. ఇది హై-బీపీ ఉన్నవారికి మంచిదే కానీ, ఇప్పటికే లో-బీపీతో బాధపడేవారికి శాపంగా మారుతుంది. దీనివల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి నీరసం, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటివి జరగవచ్చు.

జీర్ణక్రియపై ప్రభావం: చాలామంది ఉదయాన్నే పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగుతుంటారు. అయితే బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇది కడుపునొప్పి, గ్యాస్, ఉబ్బరం, విరేచనాలకు దారితీస్తుంది. బీట్‌రూట్‌లోని సహజ నైట్రేట్లు అందరి కడుపుకు పడవు.

భయపడాల్సిన అవసరం ఉందా: జ్యూస్ తాగిన తర్వాత మూత్రం లేదా మలం ఎర్రటి రంగులోకి మారడం చూసి చాలామంది క్యాన్సర్ లేదా ఇతర రోగాలని భయపడతారు. దీనిని వైద్య పరిభాషలో బీటూరియా అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం.. ఇది బీట్‌రూట్‌లోని పిగ్మెంట్ వల్ల వచ్చే సాధారణ మార్పు మాత్రమే, దీనివల్ల ప్రాణాపాయం లేదు. కానీ పైన చెప్పిన ఇతర సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి.

వీరు అస్సలు తాగకూడదు: బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, ఇది షుగర్ లెవల్స్‌ను పెంచే అవకాశం ఉంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు దీన్ని జోలికి వెళ్లకూడదు. సహజ సిద్ధమైన పానీయమే అయినా, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ఇది జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు. బీట్‌రూట్ జ్యూస్‌ను నేరుగా తాగడం కంటే, అందులో కొంచెం క్యారెట్, నిమ్మరసం లేదా అల్లం కలిపి తీసుకోవడం వల్ల దాని తీవ్రత తగ్గుతుంది. ఏదైనా సరే పరిమితంగా తీసుకున్నప్పుడే అది ఔషధంగా పనిచేస్తుంది.