
అధిక శరీర బరువు ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎల్లప్పుడూ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభిస్తే అది చెడు సంకేతంగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు చిన్నతనం నుంచే ఊబకాయంతో ఉంటారు. వీళ్లు వెయ్యి ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం సాధ్యంకాదు. పైగా తప్పుడు జీవనశైలి కారణంగా బరువు తగ్గడానికి బదులు పెరుగడం ప్రారంభమవుతుంది. అయితే ఇంకొంత మంది ఉన్నట్లుండి అకస్మాత్తుగా లావైపోతారు.

సరైన ఆహారం, వ్యాయామం నియమాలు పాటిస్తే శరీర బరువు అదుపులో ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో డైటింగ్, వ్యాయామం సరిగ్గా ఉన్నప్పటికీ బరువు పెరుగుతూనే ఉంటుంది. దాని వెనుక ఏదైనా కారణం ఉందా? అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేరట. సన్నబడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి రాత్రికి 7-8 గంటల నిద్ర అవసరం.

ఆఫీసులో ఒత్తిడి, ఇంట్లో రకరకాల సమస్యలు, పని మీద దృష్టి పెట్టేలకపోవడం.. ఇలాంటి ఒత్తిడితో బరువు తగ్గడం సాధ్యం కాదు. అందుకే ఒత్తిడి కారణంగా బరువు పెరుగుతుంటే, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యలు కూడా దాడిచేస్తాయి. ఇలాంటి సమయాల్లో బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలకు మెడిసిన్ తీసుకుంటే ఇవి కూడా బరువు పెరగడంపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి వాళ్లు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం బెటర్.

సన్నగా, ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీళ్లా తీసుకోవడం అవసరం. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో ద్రవం పరిమాణం తగ్గినప్పుడు, వివిధ సమస్యలు తలెత్తుతాయి.