ఢిల్లీలోని జైపూర్ హౌస్‌లో ఈ అద్భుతమైన ఎగ్జిబిషన్‌ను సిద్ధమైంది. విశిష్ట అతిథులకు కొసరి కొసరి తినిపించేందుకు వెండి అరిటాకులు సిద్ధం చేశారు. వెండి బంగారం కలబోసిన పాత్రలు, స్పూన్లు, గ్లాసులు, పానీయ పాత్రల్లో ఆహార పానీయాలు అందిస్తారు. అతిథులకు మనం ఇచ్చే రాచ మర్యాదలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ పాత్రలను చూస్తే అర్థమవుతుంది.
జీ20 సమావేశాలకు హాజరయ్యే VVIP అతిథులను ఆదరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని జైపూర్ సిల్వర్‌వేర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఐరిష్ వెండి, బంగారు పూతతో కూడిన వస్తువుల్లో వంటకాలను అందించనున్నారు.
ఉప్పు ట్రేలో అశోక చక్ర చిత్రం ఉండడం దీని ప్రత్యేకత. డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన కటోరీ, సాల్ట్ స్టాండ్, స్పూన్లు ఉన్నాయి. గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లకు రాయల్ లుక్ వచ్చేలా చేశారు. వెండి పాత్రలకు బంగారపు పూతలు పూశారు. చేతితో నగిషీలు చెక్కి అదరహో అనిపించారు.
హస్తకళాకారులు రేయింబవళ్లు కష్టపడి ఈ కళా ఖండాలను సృష్టించారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఆహారాన్ని కూడా శిఖరాగ్ర స్థాయిలో అందించడానికి వాళ్లు పడ్డ కష్టం డైనింగ్ టేబుళ్ల మీద ఇలా కనువిందు చేస్తోంది
మొత్తంగా అద్భుతమైన భారతీయ వంటకాలను వాళ్లకు రుచి చూపించబోతోంది. అలాగే, ఈ పర్యటన వాళ్లకు ఓ మధురానుభూతి కలిగేలా హస్త కళలతో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్‌ను రెడీ చేసింది. ఇక కళ్లు చెదిరే లైట్ షోలు, కలర్ వాటర్ ఫౌంటెన్లు గురించి ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? చూసి తరించాల్సిందే అన్నట్టు ఉన్నాయి.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని 'భారత్ మండపంలో' జీ-20 సదస్సు శనివారం నుంచి జరగనుంది. ఈ సదస్సుకు వచ్చే అతిథుల ఆతిథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రగతి మైదాన్‌తోపాటు భారత్ మండపం అంతా రంగురంగుల దీపాలతో అలంకరించారు. అతిథులకు భోజనం వడ్డించే ఏర్పాట్లు కూడా కళ్లు చెదిరేలా ఉన్నాయి.