
అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం బి.దొడ్డవరం మధ్యలంకలో అరుదైన వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వేలాది ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్‌లు తుమ్మ చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి. ఐరోపా ప్రాంతాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఈ వలస పక్షులు ప్రతి ఏడాది బి.దొడ్డవరం మధ్యలంకకు చేరుకుంటున్నాయి. ఇక్కడ తుమ్మ చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి.

గత నాలుగేళ్లుగా ఇదే ప్రాంతానికి రావడం ఈ పక్షులకు ఆనవాయితీగా మారింది. ఇక్కడ పిల్లలను పొదిగి, అవి ఎగరగలిగే స్థాయికి వచ్చిన తర్వాత వాటిని వెంట తీసుకుని తిరిగి తమ వలస ప్రాంతాలకు వెళ్లడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి నదిలో లభించే నత్తలు ఈ పక్షులకు ప్రధాన ఆహారం. నత్తలను తమ పొడవాటి ముక్కుతో పొడిచి తినడంతో స్థానికులు వీటిని ముద్దుగా “నత్తకొంగలు” అని పిలుస్తున్నారు.

అయితే ఈ పక్షులు తుమ్మ చెట్లనే తమ ఆవాసంగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ చెట్లకు ఉండే పదునైన ముళ్ల కారణంగా పాములు గూళ్లను చేరుకోవడం కష్టమవుతుంది. దీంతో విషసర్పాల నుంచి తమ పిల్లలను రక్షించుకునేందుకు ఈ పక్షులు ముళ్లతో కూడిన తుమ్మ చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయని నిపుణుల అభిప్రాయం.

వేలాది పక్షులు ఒకేచోట గూళ్లు ఏర్పాటు చేసుకుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే సందడి మధ్యలంకకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పక్షుల కిలకిలారావాలతో ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తోంది. తమ ప్రాంతానికి ఇంత పెద్ద సంఖ్యలో వలస పక్షులు రావడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

అయితే కొంతమంది వేటగాళ్లు ఈ పక్షులను వేటాడే బయట విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు..ఈ పక్షుల ఆవాసాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. పక్షులను వేటాడకుండా వేటగాళ్ల దాడి నుంచి సంరక్షించాలని వారు కోరుతున్నారు. గోదావరి తీరంలో ప్రకృతి అందాలకు మరో అందమైన చిరునామాగా మారిన బి.దొడ్డవరం మధ్యలంక.. వేలాది వలస పక్షులకు ఇప్పుడు సురక్షితమైన నిలయంగా మారింది...