
తోటకూరలో ఉండే ఐరన్, ఫైబర్‌లతో పాటు శనగపిండి లేదా పుట్నాల పొడిలోని ప్రోటీన్ కలవడం వల్ల ఇది నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైన, కమ్మటి ఫ్రైగా మారుతుంది. ఈ వెజ్ లివర్ ఫ్రై తయారీ విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా లేత తోటకూరను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి మరియు ఉడికించిన తోటకూర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్‌లో ఒక గుడ్డు.. అలాగే వెజిటేరియన్లు గుడ్డుకు బదులుగా శనగపిండి పరిమాణాన్ని పెంచుకోవచ్చు, అర కప్పు పుట్నాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఒక కేక్ ట్రే లేదా ఇడ్లీ పాత్రలో వేసి 10 నిమిషాల పాటు ఆవిరిపై స్టీమ్ చేయాలి. ఆవిరిపై బాగా ఉడికిన తోటకూర కేక్‌ను బయటకు తీసి, లివర్ ముక్కల ఆకారంలో చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను వేడి నూనెలో వేసి పై పొర క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల నాన్-వెజ్ లివర్ ఫ్రైకి ఉండే మీటీ టెక్స్చర్, క్రంచీనెస్ లభిస్తాయి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా మరియు కొద్దిగా పెరుగు వేసి నూనె తేలే వరకు వేయించాలి.

చివరిగా మిరియాల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కలను వేసి మసాలా బాగా పట్టేలా టాస్ చేయాలి. కొత్తిమీర, నిమ్మరసం పిండి దింపేస్తే గుమగుమలాడే వెజ్ లివర్ ఫ్రై సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంలోకి, లేదా స్నాక్‌గా తిన్నా ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది.