
కంటి వ్యాధులు: భారత్ ప్రపంచంలోనే అత్యధిక కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేసే దేశమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న మయోపియా (దూరపు వస్తువులు అస్పష్టంగా కనిపించడం) సమస్య ఒక కొత్త సవాలుగా మారింది. దీనిని నివారించడానికి పోషకాహారం, సకాలంలో కంటి పరీక్షలు, జీవనశైలిలో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహం: దేశరాజధాని ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 30శాతం మంది ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారు. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం. ఈ వ్యాధిని నియంత్రించడానికి మందులు సహాయపడినప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన అవగాహన ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు.

గుండె జబ్బులు: గుండె అన్ని వ్యాధులకు కేంద్రమని వైద్యులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గుండె జబ్బుల కేసుల.. ముఖ్యంగా యువకుల్లో గణనీయంగా పెరిగాయి. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో 'గోల్డెన్ అవర్'లో చేసే యాంజియోప్లాస్టీ ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 80-90 సంవత్సరాల వయస్సు వారికి కూడా అధునాతన గుండె చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

నోటి క్యాన్సర్: పొగాకు, పాన్-మసాలా, చెడు ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో నోటి క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. అందుకే దేశాన్ని 'ఓరల్ క్యాన్సర్‌కు రాజధాని' అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యాధిని అరికట్టడానికి ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం, తక్కువ ధరకే దంత బీమా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రపిండాల వ్యాధులు: మూత్రపిండాల వ్యాధి ఇప్పుడు ఒక అంటువ్యాధిగా మారింది. దేశంలోని 13.16శాతం మంది పెద్దలు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.