
ఎన్నో పోషక విలువలు ఉన్న జామ కాయను తినేందుకు అందరూ ఇష్టపడుతారు. తక్కువ ధరలో ఎక్కవ పోషకాలను అందించే పండ్లలో జామకాయ కూడా ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈపండును తినేందుకు ఇష్టపడుతారు. అయితే చాలా మంది పండు తిని దాని తొక్కను డస్ట్‌బిన్‌లో పాడేస్తుంటారు. మీరు కూడా అలాగే చేస్తుంటే, ఆపండి. ఎందుకంటే దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

జామతొక్కలో ఉండే పోషకాలు, సహజ సువాసన, ఆమ్ల గుణాలు ఇంటిని శుభ్రపరచడానికి, మొక్కల సంరక్షణకు, వంటగది చిట్కాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అవును జామ తొక్కలను పారేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేయవచ్చు. ఇందుకోసం తొక్కలను చిన్న ముక్కలుగా కట్‌చేసి కంపోస్ట్‌లో కలపండి. ఇది మొక్కలకు నత్రజని,పొటాషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీని వల్ల మొక్క కాపు పెరుగుతుంది.

జామ తొక్కలను న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు జామ తొక్కలను తీసుకొని దాల్చినచెక్క లేదా లవంగాలతో పాటు నీటిలో ఉడకబెట్టండి. ఆ నీటి నుంచి వచ్చే ఆవిరి మీ ఇంట్లోని దుర్వాసనలను తొలగించి, ఇల్లంతా గాలిని తాజాగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

జామ తొక్కలతో ఇంట్లోనే సువాసనగల క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిలో నిమ్మరసం డెట్టాల్ కలిపి, ఒక ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మీ రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఇతర గృహోపకరణాలను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. ఇది మురిని తొలగించడంతో చాలా ప్రభావవంతంగా పనిచేసింది.

అంతేకాదు మీ ఇంట్లోని పాత్రల నుండి దుర్వాసనను తొలగించడానికి కూడా ఈ జామ తొక్కలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మాంసాహార వంటకాలు లేదా గుడ్లు వండిన తర్వాత, పాత్రల నుండి తరచుగా తీవ్రమైన వాసన వస్తుంది. కాబట్టి, సబ్బుతో పాత్రలు కడిగిన తర్వాత, వాటిని జామ తొక్కలతో రుద్ది తర్వాత నీటితో కడిగేయండి. ఇది మొండి వాసనలను తక్షణమే తొలగించి తాజాగా సువాసనను అందిస్తుంది.