ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సీజన్‌కు ఆరంభ మ్యాచ్ కావడంతో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆర్సీబీ.. సూపర్ విక్టరీ సాధించి.. 18వ సీజన్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
ఫిల్ సాల్ట్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కోహ్లీ.. 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ రన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విరాట్ వేయి పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. అయితే కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాదు.. ఒక సీనియర్ ప్రోగా కోహ్లీ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే. జోష్ హెజల్‌వుడ్ బౌలింగ్‌లో కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ గాల్లోకి షాట్ ఆడాడు. ఆ సులువైన క్యాచ్‌ను ఆర్సీబీ యంగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ నేల పాలు చేశాడు. ఫస్ట్ ఓవర్‌లోనే డేంజరస్ డికాక్‌ను అవుట్ చేసే ఛాన్స్‌ను మిస్ చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ అయ్యారు.
ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఓవర్‌లోనే ప్రత్యర్థి ఓపెనర్‌ను పెవిలియన్ చేరిస్తే.. ఆర్సీబీ కాన్ఫిడెన్స్ పెరిగేది కానీ, సుయాష్ వల్ల అది జరగలేదు. కానీ, హెజల్‌వుడ్ అద్భుతమైన బాల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ సూపర్ క్యాచ్‌తో డికాక్ అదే ఓవర్‌లో అవుట్ అవ్వడంతో సుయాష్ ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ సమయంలోనే సుయాష్ శర్మ వద్దకు వెళ్లిన కోహ్లీ, అతన్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు. జట్టులో ఒక పెద్ద దిక్కుగా ఉన్న ఆటగాడు.. ఏం పర్వాలేదు. క్యాచ్ మిస్ అయినంత మాత్రం అంత టెన్షన్ పడకు, ఛాన్సులు మళ్లీ వస్తాయి.. గేమ్‌లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయంటూ సుయాష్‌ను నార్మల్ చేసే ప్రయత్నం చేశాడు కోహ్లీ. ఈ సీన్స్ చూసి.. కోహ్లీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.