
దేవుడి ముందు తలవంచి.. మనసులోని కోరికను చెప్పుకోవడం ప్రతి భక్తుడి విశ్వాసం. భక్తికి హద్దులుండవు. మనసారా కోరుకున్న కోరిక నెరవేరాలని.. రాయితోనైనా, పువ్వుతోనైనా, ప్రార్థనతోనైనా స్వామివారిని ఆశ్రయిస్తాడు భక్తుడు. తమ కోరికను నెరవేర్చాలంటూ వివిధ రకాలుగా ముడుపులను కడుతుంటారు. కానీ కొందరు భక్తులు ప్రత్యేక ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ విశ్వాసానికి కొత్త రూపం కనిపిస్తోంది. ఆ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. భక్తుల ఇలవేల్పుగా పాంచనారసింహుడు.. వెలుగొందుతున్నాడు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్, సెలవు రోజుల్లో యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు వివిధ రూపాల్లో స్వామివారిని ఆరాధిస్తుంటారు. ఎవరి కోరిక వారిది, ఎవరి మొక్కు వారిది. తమ కోరికను నెరవేర్చాలంటూ స్వామి గారికి ప్రత్యేకంగా ముడుపులు కడుతుంటారు.

తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా ముడుపులను కూడా చెల్లిస్తుంటారు. అయితే ఇటీవల ఆలయ ప్రాంగణంలో ఓ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొబ్బరి కాయ కాదు.. కొబ్బరి చెట్టు కాదు.. ఇటుకలే మొక్కుబడిగా మారాయి. గుడి పరిసరాల్లో కనిపించే చిన్న చిన్న రాళ్లు, ఇటుక ముక్కలను భక్తులు సేకరించి... వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి చిన్న ఆలయాల మాదిరిగా పేర్చుతున్నారు. కొందరు గోపుర ఆకారంలో, మరికొందరు మండపంలా,ఇంకొందరు ఇంటి నమూనాలో రాళ్లను పేర్చి తమ కోరికలను దేవుడికి తెలియజేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఇలా రాళ్లు పేర్చితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఉద్యోగం రావాలని, వివాహం జరగాలని, సంతానం కలగాలని... ఆరోగ్యం బాగుపడాలని భక్తులు కోరుకుంటున్నారు. కొత్తగా వచ్చిన భక్తులు వాటిని చూసి, తామూ అదే విధంగా మొక్కులు చెల్లించడం మరో విశేషం. ఇలా ప్రతి కోరికకు ఓ చిన్న రాతి గోపురం సాక్ష్యంగా నిలుస్తోంది.

కొంతమంది దీన్ని భక్తి వ్యక్తీకరణగా భావిస్తుంటే, మరికొందరు ఇది శాస్త్రాల్లో లేని ఆచారమని అంటున్నారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు ఈ నిర్మాణాలను ఆసక్తిగా పరిశీలిస్తూ, ఫొటోలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇటుకలు రాళ్లతో ముడుపులు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి