
ఇంటికి అందాన్ని ఇవ్వడంతో పాటు సుఖసంతోషాలు, సిరిసంపదలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చాలామంది తమ ఇళ్లలో మనీ ప్లాంట్‌ను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్ ఉండే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అయితే, ఈ మొక్కను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచకపోతే లేదా కొన్ని చిన్నపాటి తప్పులు చేస్తే అనుకున్న ఫలితాలు రాకపోగా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనీ ప్లాంట్ విషయంలో పాటించాల్సిన కీలక నియమాలు ఇక్కడ చూద్దాం.

ఏ దిశలో ఎలా ఉంచాలి? మనీ ప్లాంట్‌ను ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలనుకుంటే, నీటితో నింపిన నీలం రంగు గాజు సీసాలో పెంచడం ఎంతో శ్రేయస్కరం. ఇది వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొత్త ఆర్థిక అవకాశాలను తెచ్చిపెడుతుంది. అదే విధంగా తూర్పు నుంచి ఆగ్నేయ దిశ మధ్యలో ఉంచాలనుకుంటే మట్టి కుండీలో నాటి పెంచడం వల్ల పొదుపు పెరిగి, బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉంటుంది.

మనీ ప్లాంట్ విషయంలో చేయకూడని ముఖ్యమైన తప్పులు: మనీ ప్లాంట్ తీగలు నేలకు ఆనుతూ కిందికి వేలాడటం వాస్తు ప్రకారం తీవ్రమైన దోషం. ఇది ఆర్థిక క్షీణతకు కారణమవుతుంది. కాబట్టి కర్ర, మాస్ స్టిక్ లేదా తాడు సాయంతో తీగ ఎల్లప్పుడూ పైకి ఎదిగేలా కట్టాలి.

మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం లేదా కుళ్ళిపోవడం మంచిది కాదు. తగినంత నీరు, వెలుతురు అందిస్తూ మొక్క నిగనిగలాడేలా నిత్యం జాగ్రత్త తీసుకోవాలి. మనీ ప్లాంట్ చుట్టుపక్కల ఎరుపు రంగు వస్తువులు, పెయింటింగ్స్ లేదా ఎరుపు కుండీలను పెట్టకూడదు. ఎరుపు రంగు అగ్ని తత్వానికి ప్రతీక కావడం వల్ల మనీ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది.

మనీ ప్లాంట్ ఆకులు లేదా కొమ్మలను కత్తిరించాల్సి వచ్చినప్పుడు ఇంట్లోని కుటుంబ సభ్యులే స్వయంగా చేయాలి. బయటి వ్యక్తుల చేత కత్తిరించడం లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించివేసినట్లుగా భావిస్తారు. ఈ వాస్తు సూత్రాలను పాటిస్తూ మనీ ప్లాంట్‌ను సంరక్షిస్తే ఇంట్లో సిరిసంపదలు, ప్రశాంతత నిలుస్తాయి.