వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించినా అందులో పెట్టే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఉంచడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనితో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టకపోయినా లేదా ఎవరి ఇంట్లో అయినా వస్తువులు వాస్తు శాస్త్ర ప్రకారం ఉంచకపోయినా ఆ ఇళ్లలో వాస్తు దోషాలు తలెత్తుతాయి. దీని కారణంగా ఇంట్లో అసమ్మతి, ప్రతికూలత పెరుగుతుంది.
డబ్బు ఎక్కడ ఉంచాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు ఉంచడానికి ఉత్తమ దిశ నైరుతి. ఈ దిశలో డబ్బులు, నగలు భద్రంగా ఉంచడం వలన సంపదను పెరుగుతుందని నమ్మకం. అంతేకాదు డబ్బులను పొరపాటున కూడా పడమర లేదా దక్షిణం వైపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏ దిశను ఖాళీగా ఉండాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తూర్పుకి, ఉత్తరానికి మధ్యన దిశలో అంటే ఈశాన్య దిశలో తరచుగా ప్రజలు కొన్ని వస్తువులను ఉంచుతారు. అయితే ఈ స్థలం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ సామరస్యం, ప్రేమ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎలాంటి రోగాలు దరిచేరవు.
సంతోషాన్ని కలిగించే లాఫింగ్ బుద్ధ.. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ప్రతిష్టించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఎందుకంటే లాఫింగ్ బుద్ధ సుఖ సంతోషాలకు చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ప్రధాన ద్వారం ముందు, తూర్పు దిశలో లేదా సూర్యుడు ఉదయించే దిశలో, ఈశాన్య దిశలో, పిల్లల చదువుకునే గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
స్వస్తిక్ ను ఎలా వేయాలంటే.. ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారంపై పసుపు, కుంకుమ, గంధంతో స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ ను వేసే సమయంలో అది 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
పంచముఖి హనుమంతుడు.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉండాలి. ఇది సాధ్యం కాకపోతే ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో ఉండాలి. అయితే దక్షిణ దిశ ప్రధాన ద్వారంగా ఉన్నప్పుడు అక్కడ పంచముఖి హనుమంతుడి చిత్రపటాన్ని ఖచ్చితంగా ఉంచండి. అంతేకాదు పంచధాతుతో చేసిన పిరమిడ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుర్రపు నాడా.. వాస్తు శాస్త్రంలో గుర్రపు నాడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీన్ని అమర్చాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా శుభం కలుగుతుంది.
తులసికి సంబంధించిన నివారణలు.. తులసి మొక్కను హిందూ మతంలో పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కను గౌరవిస్తారు. తులసి మొక్కతో పాటు, తులసి వేరు కూడా చాలా ప్రయోజనకరమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క వేర్లను ఎర్రటి గుడ్డలో కట్టి, ప్రధాన ద్వారంపై వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంట్లో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.