ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వకుళాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడట శ్రీ విష్ణు భగవానుడు. పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడిని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులనను సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని, మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడినికి ఎక్కడ కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదని పురాణాలు చెబుతున్నాయి.
చిన్నారి కన్నయ్యను ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది యశోద . అయితే కంసుని వధానంతరం ఆ శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడు వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి.
చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా. అని చింతిస్తున్న యశోదమాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ.. అమ్మా నీవు ఏ మాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇచ్చాడు. మాతృమూర్తివి బాధపడితే ఈ శ్రీకృష్ణుడికి మనుగడే లేదంటూ యశోదాను ఓదార్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిచ్చాడు. అది ఈ ద్వాపరయుగంలో కాదు. తర్వాత వచ్చే కలియుగంలో అని వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకుళామాతలా వేంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారి తన కోరికను నెరవేర్చుకుంది.
గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేథ్యం పెట్టేవారని ప్రసిద్థి. పేరూరు కొండపై ఉన్న వకుళామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినబడేది. అలా ఎంతో చారిత్రక కట్టడం వకుళామాత ఆలయం. ఇన్ని రోజులు శిధిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడిప్పుడే మళ్లీ అభివృద్ధి చెందుతుంది.