
వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరమైన ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్‌ను వినియోగించే అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.

రోబోట్‌లో ప్రత్యేకత ఇదే..ఈ రోబోట్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

రోబోట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్‌డ్ అలర్ట్‌ను పంపడంతోపాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించే విధంగా వ్యవస్థను వినియోగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అలిపిరి తిరుమల నడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు, అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

వన్యప్రాణులు భక్తుల రాకపోకల ప్రాంతం వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించారు. తద్వారా మనుషులు వన్యప్రాణుల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు అవకాశముండదని టిటిడి భావిస్తోంది. ఈ రోబోట్ ఇప్పటికే అమల్లో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా పనిచేసేలా వినియోగించే ఆస్కారం ఉంటుంది. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీనిని త్వరగా మోహరించే వీలుంటుంది.

అటవీ ప్రాంతాల్లో రోబోట్ ద్వారా సేకరించే వీడియో, థర్మల్ చిత్రాలు, వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి సంచారాన్ని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకుని, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మెరుగుపరచే అవకాశాలు మెరుగు పడుతుందని టీటీడీ భావిస్తోంది.