శ్రీవారి ప్రముఖ భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచిన దారి అలిపిరి. ఈ మార్గంగుండా అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండకు చేరుకున్నారు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు.
స్వయంగా శ్రీవారు నడిచిన దారి.. శ్రీవారి మెట్టు.. ఇది తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం ఈ శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారట. ఇప్పటికీ కొండపైకి కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు.
ఆదిపడి , శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున ఉన్న కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉండేది. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.
శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి మరో నడక మార్గం.. శ్యామలకోన అనే దారి. కల్యాణి డ్యాం నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.
మలయప్ప స్వామి దర్శనానికి నడక దారి.. కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం చేరుకొని అక్కడ నుంచి పాపవినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు.
అవ్వచారి కోన దారి.. రేణిగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
మరో నడక దారి ఏనుగుల దారి. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. అందుకనే ఈదారికి ఏనుగుల దారి అనే పేరు వచ్చింది.
తలకోన నుంచి కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కనుకనే దీనికి తలకోన అని పేరు వచ్చింది. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే .తిరుమల చేరుకోవచ్చు. ఒకప్పుడు నెరభైలు, ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే ఒకప్పుడు తిరుమలకు చేరుకొనేవారట. అయితే ఇపుడు అలిపిరి, శ్రీవారి మెట్టు మినహా మిగిలిన నడకదారులు వాడుకలో లేవు.. అంతేకాదు అడవులతో ఉన్న ఈ దారుల్లో ప్రయాణం ప్రమాదకరం కూడా..