
మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పటికీ చాలా మంది ఆచరిస్తుంటారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రతి ఆచారాన్ని పాటిస్తుంటారు. అలాగే వివాహమైన స్త్రీలకు ఒడి బియ్యం పోయడం కూడా ఒక ఆచారమే. ఇది నేటికి పల్లెల్లో, పట్టణాల్లో చాలా మంది ఆచరిస్తున్నారు. కాగా దీని గురించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

ఆడ పిల్ల అంటే ఆ ఇంటి మహాలక్ష్మీ. అయితే తనకు వివాహం సమయంలో లేదా వివాహం జరిగిన తర్వాత ఒడి బియ్యం పొయ్యడం అనేది సహజం. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఒడి బియ్యం పోస్తుంటారు. ముఖ్యంగా వివాహం సమయం, లేదా పుట్టి్ంట్లో ఏదైనా పెద్ద పండుగ చేసుకున్న సమయంలో, తన కూతురు మరో బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో, సారె పోసి, పంపిస్తారు. ముఖ్యంగా పుట్టింటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, బట్టలు పెట్టి, ఒడి బియ్యం పోసి పంపిస్తారు.

ఇక ఈ ఒడి బియ్యం పొయ్యడం వెనుక కూడా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి, అల్లుడిని మహావిష్ణువులా భావించి, తమ కూతురుని రక్షించమని, బియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి తనకు విన్నపం చేయడం. ఇది ఆడపిల్ల గౌరవానికి సూచిక. తమ బిడ్డ అష్టైశ్వార్యాలతో చల్లగా ఉండాలని , బిడ్డకు ఒడి బియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి దీవించి పంపుతారు. అలాగే తన తల్లి గారి ఇల్లు కూడా అష్టైశ్వార్యాల తో తులతూగాలని ఆడ బిడ్డ తనకు పోసిన బియ్యం నుంచి ఐదు పిరికిల్లు తీసి, అమ్మవాళ్లకు ఇస్తుంది. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి పుట్టింటికి, అత్తింటికి మేలు జరుగుతుందని వారి నమ్మకం.

అదే విధంగా ఒడి బియ్యం పొయ్యడం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే? మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయంట. అందులో ఏడవ చక్రం గౌరీ దేవి. ఈమె మణి పుర చక్రం నాభి వద్ద ఉంటుందంట. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందుకే వివాహం తర్వాత ఆడపిల్లకు బియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి శక్తికి బియ్యం సమర్పించడం.

అందుకే వివాహం తర్వాత ప్రతి పుట్టింటి వారు తమ కూతురు అత్తింట్లో ఆనందంగా ఉండాలని, ఎటువంటి కష్టాలు లేకుండాఅష్టైశ్వర్యాలతో తులతూగాలని పుట్టింటి వారు తన బిడ్డకు ఒడి బియ్యం పోసి, గౌరవంగా అత్తింటికి సాగనంపుతారు.