
మేషం: ఈ రాశినాథుడు పోరాట స్ఫూర్తి కలిగిన కుజుడు. వీరిలో ఆశలు, ఆశయాలు బాగా ఎక్కువగానే ఉంటాయి. తమకు అందుబాటులోకి వచ్చిన ఎటువంటి అవకాశాన్నీ వీరు వదులుకోరు. ధైర్య సాహసాలు, దృఢ సంకల్పంతో వీరు తాము అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. ఎంతో దూర దృష్టితో సరైన విధంగా మదుపులు చేయడం, పెట్టుబడులు పెట్టడం, అవసరమైతే కంపెనీలు మారడం, కొత్త వ్యాపారాలు చేపట్టడం వంటి కారణాలతో వీరు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశినాథుడు శుక్రుడు. లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఓర్పు, సహనాలు, నిరీక్షణ తత్వం వీరిలో ఎక్కువ. రాశినాథుడు శుక్రుడు భోగభాగ్యాలకు, సిరిసంపదలకు కారకుడు. ఎంతో దూర దృష్టితో వీరు మదుపులు చేయడం, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కష్టపడే తత్వం కలిగిన వీరు షేర్లు, స్పెక్యులేషన్లు వంటి ఆర్థిక లావాదేవీలు, ఇతర అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. లక్ష్మీ కటాక్షంతో తప్పకుండా సంపన్నులు కావడం జరుగుతుంది.

సింహం: ఈ రాశికి అధిపతి గ్రహ రాజు సూర్యుడు. ఏ రంగంలోనైనా తానే అగ్రస్థానంలో ఉండాలన్న కోరిక ఎక్కువ. ఫలితంగా ఈ రాశివారు ఉన్నత స్థాయి వ్యక్తులతో, వ్యాపారులతో, వాణిజ్యవేత్తలతో పరిచయాలు పెంచుకుని బాగా లాభపడతారు. సాహసం, తెగింపు, చొరవ, నాయకత్వ లక్షణాలు కలిగిన వీరు తమకు అందిన ప్రతి అవకాశాన్నీ, తమకున్న ప్రతి పరిచయాన్నీ ఉపయోగించుకుని అందలాలు ఎక్కుతారు. కొద్ది కాలంలో ఒక కొత్త సంస్థను స్థాపించే అవకాశం కూడా ఉంది.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడికి పట్టుదల ఎక్కువ. వీరిలో వ్యాపార ధోరణి, దన కాంక్ష, ఉన్నతాశయాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకునిపోయే తత్వం, అనుకున్నది సాధించాలనే తత్వం కలిగిన ఈ రాశివారు అదనపు ఆదాయ మార్గాలతో డబ్బు కూడగట్టుకుని, సరైన విధంగా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పురోగతి సాధించడం జరుగుతుంది. ఉద్యోగం చేస్తూనే వ్యాపా రాలు చేపట్టడం, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల మిలియనీర్లు కావడానికి అవకాశం ఉంది.

ధనుస్సు: గురువు అధిపతి అయిన ఈ రాశివారిలో యాంబిషన్ కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉన్నత స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తుంటారు. ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించడం, ఎప్పటి కప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడం, కొత్త మార్గాలను, అవకాశాలను అన్వేషించడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారు కలలో కూడా ఊహించని ఆదాయ మార్గాలను అనుసరించి, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలతో సంపన్నులయ్యే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశివారిలో పట్టుదల, మొండితనం కాస్తంత ఎక్కువ. వీరిలో దూరదృష్టి కూడా ఎక్కువే. రాశి నాథుడు శని ఎంతటి శ్రమకైనా ఓర్చి, ఒక పథకం ప్రకారం లక్ష్యాలను చేరుకోవడంలో దిట్ట. ఈ రాశివారు సదవకాశాలను, ఆదాయ మార్గాలను తేలికగా గుర్తిస్తారు. వీరు తమ నైపుణ్యాల్ని మరింతగా పెంచుకోవడానికి, పరిచయాల్ని విస్తరించుకోవడానికి బాగా అవకాశం ఉంది. ఊహించని ఆదాయ మార్గాలు లభిస్తాయి. వీరు భాగ్యవంతులు కావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.