
ఏడాదికి దీపావళి సందర్భంగా తలపులు తెరచుకుని కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దర్శనం ఇచ్చే హాసనాంబే దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అమ్మవారి దర్శనం కోసం ప్రత్యెక ఏర్పాట్లు చేసినట్లు హాసనాంబే ఆలయ కార్యనిర్వహణాధికారి మారుతి చెప్పారు. గత ఎనిమిది రోజుల నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు దర్శించుకోగా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా 8 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని చెప్పారు.

ఈ ఏడాది జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతో భక్తుల రద్దీ పెరిగింది. పాస్‌లు రద్దు చేసినా భక్తుల తాకిడి తగ్గలేదు. ఊహించిన దానికంటే అధికంగా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారని తెలిపారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు హాసనాంబే దర్శనం జరగనుంది. అనంతరం శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం ప్రారంభం కానుంది. అనంతరం రాత్రి 11 గంటల నుంచి మళ్లీ హాసనాంబే దర్శనం ప్రారంభమవుతుంది.

రేపు ఉదయం అంటే సోమవారం 6 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని.. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించరని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు జరిగే హాసనాంబే దర్శన మహోత్సవం రేపు మధ్యాహ్నం 12 గంటలతో ముగుస్తుందని చెప్పారు. రేపు గర్భగుడిని మూసివేస్తున్నట్లు అధికారి మారుతి తెలిపారు.