
ధన కారకుడు, గృహ, వాహన కారకుడు అయిన గురువు అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నందువల్ల, రాశ్యధిపతి అనుకూలత వల్ల కొన్ని రాశుల వారు రెండు మూడు నెలల్లో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి వీరికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ దిశగా కొద్దిపాటి ప్రయత్నం చేయడం మంచిది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఇక గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. గురు బలం వల్ల ఈ రాశులవారు తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు జూన్ మొదటి వారం నుంచి ఉచ్ఛ స్థితిలోకి వచ్చినందువల్ల ఈ రాశివారు జూలై, అక్టోబర్ నెలల మధ్య గృహ ప్రవేశం చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తు న్నాయి. ఇప్పటి నుంచే వీరు సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది. రుణ సౌకర్యాలు, ఆర్థిక సహాయాలు లభించడానికి అవకాశం ఉంది. సాధారణంగా వీరు ఫ్లాట్ కొనడం జరుగుతుంది. వీరు జూలై తర్వాత తప్పకుండా సొంత వాహనం కూడా కలిగే ఉండే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు కూడా ఆగస్టు వరకు అనుకూలంగా ఉంటున్నందువల్ల ఈ రాశివారు జూలై, ఆగస్టు నెలల్లో సొంత ఇల్లు కలిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై తర్వాత తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాలు తేలికగా అందుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది.

కర్కాటకం: గృహ, వాహన కారకుడైన గురువు ఈ రాశిలో జూన్ మొదటి వారం నుంచి ఉచ్ఛస్థితిలో ఉంటు న్నందువల్ల ఈ రాశివారికి జూలై తర్వాత తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. అక్టోబర్ ప్రాంతంలో గృహ ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంది. గురువు ధనకారకుడు కూడా అయినందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలించడంతో పాటు రుణ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 16 తర్వాత వీరికి తప్పకుండా వాహన యోగం కూడా పట్టే అవకాశం ఉంది.

కన్య: గృహ కారకుడైన గురువు ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, రాశ్యధిపతి బుధుడు కూడా దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ఆగస్టు చివరి నాటికి గృహ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నం దువల్ల సొంత ఇంటి మీద భారీగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటితో పాటు ఆశించిన స్థలాన్ని, వాహనాన్ని కొనడానికి కూడా అవకాశం ఉంది. రుణ సౌకర్యం తేలికగా లభించవచ్చు.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి గృహ, వాహన సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ముందుగా గృహ యోగం పట్టే అవకాశం ఉంది. జూలై తర్వాత తప్పకుండా గృహ ప్రవేశం చేయడం జరుగుతుంది.. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశంఉన్నందు వల్ల సొంత ఇంటి మీద పెట్టుబడి పెట్టడానికి బాగా అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన కలలు నెరవేరుతాయి.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు రాశ్యధిపతి శని కూడా బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. అక్టోబర్ ప్రాంతంలో గృహ ప్రవేశం చేయడం కూడా జరుగుతుంది. పాత ఇంటిని కొని మరమ్మతులు, పునర్నిర్మాణం చేపట్టి సొంత ఇంటిని పొందే అవకాశం కూడా ఉంది. గృహ యోగంతో పాటు సెప్టెంబర్ లోపు వాహన యోగం కూడా కలుగుతుంది. స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానమైన కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో అక్టోబర్ లోపు సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. సొంత స్థలంలో సొంతగా ఇంటిని నిర్మించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయ వృద్ధికి, ఆస్తి లాభానికి బాగా వీలున్నందువల్ల వీరి సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది ప్రయత్నంతో వాహన లాభం కూడా కలుగుతుంది. గృహ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.