
మేషం: రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ఈ నెల (జనవరి) 17 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారు ఆదాయపరంగానే కాక కెరీర్ పరంగా కూడా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడంతో పాటు, ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఏలిన్నాటి శని దోషం తగ్గిపోతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో, మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల నెల రోజుల పాటు ఈ రాశివారి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంటపండుతుంది. నిరుద్యోగుల కల సాకారమవుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కన్య: రాశినాథుడైన బుధుడు సుమారు నెల రోజుల పాటు తన మిత్రక్షేత్రమైన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతమవుతుంది. సమర్థత, శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

తుల: రాశినాథుడు శుక్రుడు చతుర్థ స్థానంలో, మిత్ర క్షేత్రంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితం మరో నెల రోజుల వరకు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. ఆస్తి వివాదాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఫిబ్రవరి 23 వరకు ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలుగు లోకి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశముంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

మకరం: రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, గురు క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ధనపరంగా ఎటువంటి లోటూ ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.