
కావాల్సిన పదార్థాలు : చేప ముక్కలు కేజీ, చింతపండు నిమ్మకాయ సైజు, ఉల్లిపాయలు 2 పెద్దవి, పచ్చి మిర్చీ ఐదు నుంచి ఆరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్, కారం రుచికి సరిపడినంత, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి. మెంతులు, ఆవాలు, జీలకర్ర,ఎండు మిర్చి, నూనె.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా చేప ముక్కలు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత వాటికి చిటికెడు పసుపు, ఉప్పు కారం , కొంచెం నూనె పోసి ముక్కలకు కారం పట్టేల కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింత పండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని దానిని మంటపై కాల్చుకొని మిక్సీ పట్టి ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసుకోవాలి.

ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. దానిపై కడాయి పెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపుదినుసులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి మిర్చీ వేసి బాగా వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయి వేగిన తర్వాత అందులో మనం ముందుగా కారంతో కలిపి పెట్టుకున్న చేపముక్కలు వేయాలి.

ఇప్పుడు చేపలు రెండు వైపులా బాగా కాలేలా చూసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింత పండు రసం తీసుకొని, దానిని చేపల మిశ్రమంలో పోయాలి. చేపలు నిండుగా చింత పండు రసం వేసి, రసం బాగా మరిగేలా చూసుకోవాలి. దీని వలన చేపలు కూడా మెత్తగా ఉడికిపోయి, రుచి చాలా బాగుంటుంది.

ఇప్పుడు చేపల రసం మరిగిన తర్వాత, అందులో మెంతి పొడి, కరివేపాకు రెబ్బలు, కారం, ఉప్పు వేసి, మరో ఐదు నిమిషాల పాటు మరగబెట్టాలి. ఇప్పుడు చింత పండు రసం మంచిగా మరుగుతూ చేపల పులుసు వాసన వస్తుంది. ఇలా మరో ఐదు నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, చివరలో కొత్తిమీర వేసి, పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ.