
ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 62 శాతం మంది కంటినిండా నిద్రపోవడం లేదని తేలింది. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల వీరి బాడీ క్లాక్ పూర్తిగా దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నిద్రలేమికి ప్రధాన కారణం.. మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లేనిని అద్యయయానాలు చెబుతున్నాయి! పడుకునే ముందు సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైటింగ్ నేరుగా కళ్లపై పడుతోంది. దీనివల్ల మెదడులో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతోంది. ఫలితంగా అర్ధరాత్రి దాటినా కంటికి కునుకు రావడం లేదని అంటున్నారు.

కేవలం గ్యాడ్జెట్లు మాత్రమే కాదు.. మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి కూడా నిద్రను దూరం చేస్తున్నాయి. ఉద్యోగ, ఆర్థిక సమస్యలు, విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి మెదడును ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటున్నారు. దానికి తోడు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కాఫీ, టీలు తాగడం, ఆల్కహాల్, సిగరెట్ల వాడకం వంటి అలవాట్లు స్లీప్ సైకిల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటున్నారు.

నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల కేవలం అలసట మాత్రమే కాదు.. శరీరంలో అనేక ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. జీర్ణక్రియ మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, విపరీతమైన కోపం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా ఇది ఆందోళన (యాంగ్జైటీ), డిప్రెషన్‌కు దారితీస్తుందని మానసిక వైద్యులు స్పష్టం చేస్తున్నారు..