
మనం తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండవచ్చు. కానీ తిన్న వెంటనే టీ తాగడం వల్ల టీలో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ అనే పదార్థాలు ఆ పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.

రక్తహీనత ముప్పు: టీలోని టానిన్లు ఆహారంలోని ఐరన్‌తో బంధాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల శరీరం ఐరన్‌ను శోషించుకోలేదు. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే శరీరంలో రక్తం తగ్గి, రక్తహీనత వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణక్రియలో ఆటంకాలు: టీలో ఉండే కెఫిన్ జీర్ణ ఎంజైమ్‌లను నిరోధిస్తుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగించి.. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం సరిగ్గా అరగకపోవడంతో కడుపు భారంగా అనిపిస్తుంది.

పోషకాల గ్రహణ శక్తి తగ్గడం వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే టీలోని కెఫిన్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి నీరసానికి దారితీస్తుంది. అంతేకాకుండా మెటబాలిజం మందగించడం వల్ల ఆహారం శక్తిగా మారడానికి బదులు కొవ్వుగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది తెలియకుండానే బరువు పెరగడానికి కారణమవుతుంది.

మరి టీ ఎప్పుడు తాగాలి?: మీరు టీ ప్రియులైతే, భోజనానికి, టీకి మధ్య కనీసం 45 నిమిషాల నుండి ఒక గంట విరామం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో శరీరం ఆహారాన్ని ప్రాసెస్ చేసి, పోషకాలను గ్రహిస్తుంది. భోజనం తర్వాత టీకి బదులుగా గోరువెచ్చని నీరు లేదా సోంపు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.