
నేటి ఉరుకులు పరుగుల జీవనశైలి కారణంగా శారీరక-మానసిక అలసట పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరంతర పని, ఒత్తిళ్ల మధ్య జీవించే ప్రజలకు మధ్యాహ్నం తీసుకునే చిన్న నిద్ర ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, కొద్ది నిమిషాల మధ్యాహ్న నిద్ర కూడా రాత్రి నిద్రతో సమానమైన ఉత్సాహాన్ని అందించగలదని వెల్లడైంది. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో నాడీ కణాల మధ్య సంబంధాలను పునర్వ్యస్తీకరించడానికి ఒక చిన్న నిద్ర సరిపోతుందని, తదుపరి మనం మేల్కున్నప్పుడు కొత్త సమాచారాన్ని మరింత సమర్థవంతంగా నిల్వ చేయడానికి వీలు కల్పిస్తుందని కనుగొన్నారు.

మెదడుకు తిరిగి శక్తి.. మధ్యాహ్నం నిద్ర వల్ల మెదడులో ఏర్పడిన అలసట తొలగిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను త్వరగా గ్రహించే సామర్థ్యం కూడా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరమని వైద్యులు సూచిస్తున్నారు.

మానసిక ప్రశాంతత.. నిద్రలేమి కారణంగా చిరాకు, అసహనం, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. మధ్యాహ్నం చిన్న నిద్ర చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, జ్ఞాపకశక్తి మెరుగుపడుంది. మనసు ప్రశాంతంగా ఉండటంతో రోజంతా ఉత్సాహంగా, చురుకుగా పనిచేయగలుగుతాం.

గుండె ఆరోగ్యానికి తోడ్పాటు.. కొన్ని అధ్యయనాల ప్రకారం, మధ్యాహ్న నిద్ర రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెపై ఉండే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తిన్న వెంటనే నిద్ర వద్దు.. ఒక చిన్నపాటి నిద్ర మంచిదే అయినప్పటికీ.. తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఎందుకంటే జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. కడుపులో సమస్యలను కలిగిస్తుంది. అందుకే తిన్న వెంటనే కాసేపు నడిచి, ఆపై పడుకోవడం ఉత్తమం.

ఏ సమయంలో.. ఎంతసేపు నిద్ర మంచిది?.. వైద్యుల సూచన ప్రకారం.. ఉత్తమ సమయం: మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ఉత్తమ వ్యవధి: 20 నుంచి 30 నిమిషాలు ఇంతకంటే ఎక్కువసేపు నిద్రిస్తే శరీరం మందగించడంతో పాటు రాత్రి నిద్రకు ఆటంకం కలిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు.. మధ్యాహ్న నిద్రను రాత్రి నిద్రకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం శరీరానికి, మనసుకు అదనపు విశ్రాంతి మాత్రమే. ఆరోగ్యకరమైన జీవనానికి రాత్రి నిద్ర తప్పనిసరి. రోజులో కాస్త సమయం తీసుకుని చిన్న మధ్యాహ్న నిద్ర చేయడం ఒక మంచి అలవాటు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, పనిలో నాణ్యతను కూడా పెంచుతుంది. అలసటను దూరం చేసి, ఉత్సాహాన్ని నింపే ఈ అలవాటు ప్రతి ఒక్కరూ అలవరచుకోవాల్సిందే.