
వాతావరణ కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి కారణంగా చర్మం కాంతిని కోల్పోతుంది. దీంతో ముఖంపై తరచూ మొటిమలు, మచ్చల సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలోనే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొంతమందిలో తరచూ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటివారు క్రమం తప్పుకుండా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మంచి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.

సబ్జా గింజల్లో విటమిన్ ఇ సమృద్ధిగా నిండి వుంటుంది. విటమిన్ ఇ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. తరచూ సబ్జా గింజలు వాడకం వల్ల చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.

ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు సబ్జా గింజలను క్రమం తప్పకుండా వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే, ఈ గింజలతో తయారు చేసిన ఫేస్ఫ్యాక్ వేసుకుంటే ముఖంపై ముడతలు, మచ్చలను దూరం చేస్తుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలుపుకొని ముఖానికి రాసుకుని.. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే త్వరలోనే మీరు ఊహించని మార్పును చూస్తారు.

సబ్జా సీడ్స్ కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు..జుట్టుకు కూడా మంచి పోషకాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు - వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది.