
సజ్జ రొట్టె: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సజ్జ రొట్టెలు చాలా బాగుంటాయి. ఇది తయారు చేసేందుకు సజ్జ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తరిగిన కూరగాయలు కలిపి పెనం మీద రొట్టెలా కాల్చుకోవచ్చు. ఇది చాలా త్వరగా పూర్తవుతుంది. అలాగే అద్భుతమైన పోషకాలను అందిస్తుంది.

గుడ్డు-ఆమ్లెట్- దోసె: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఆమ్లెట్ దోశ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే రెండు ఉడికించిన గుడ్లు లేదా కూరగాయలతో కూడిన ఆమ్లెట్ తీసుకోవచ్చు. దోసెతో కలిపి గుడ్డు తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

పెసరట్టు: ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పెసరట్టు తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పెసరపప్పును అరగంట నానబెట్టి, ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కలిపి మిక్సీ పట్టి, కొద్దిగా ఇడ్లీ పిండిలో కలిపి దోసెలు వేసుకోవచ్చు. ఇది కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సూపర్బ్‌గా ఉంటుంది.

అటుకుల ఫ్రూట్ మిక్స్: అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అటుకులను నీళ్లలో తడిపి, కాసేపు నానబెట్టిన తర్వాత అందులో కొబ్బరి తురుము, బెల్లం లేదా మీకు నచ్చిన పండ్లను కలిపి తీసుకుంటే.. ఐదు నిమిషాల్లో బలమైన ఆహారం రెడీ. వీటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పోపు వేసి అటుకుల ఉప్మా చేసి, చివరగా కొబ్బరి తురుము చల్లితే ఎంతో రుచిగా ఉంటుంది.

వెజిటబుల్ ఉప్మా: బ్రేక్‌ఫాస్ట్‌లోకి త్వరగా అయ్యే రెసిపీస్‌లో వెజిటేబుల్ ఉఫ్మా కూడా ఒకటి. గోధుమ రవ్వలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీకు నచ్చిన కూరగాయలు వేసి ఉప్మా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు రోజంతా కావలసిన శక్తిని ఇస్తుంది. చిన్నపాటి ప్రణాళిక ఉంటే, ప్రతిరోజూ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అసాధ్యమేమీ కాదు. కాబట్టి ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు.