
ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ సాగుపట్ల రైతులు మక్కువ చూపుతున్నారు. ఈ ఏడాది సీజన్ దేవ నూర్ డీలక్స్, బ్యాడిగి, తేజ రకాలు అత్యధికంగా 25 వేల నుండి 30 వేల రూపాయల ధర పలికాయి. సాధారణంగా పది వేల నుండి ఇరవై వేల ధర పలికే మిర్చి రకాలే అధికంగా సాగు చేస్తుంటారు. చీడపీడలు పెరిగిపోవడంతో పాటు సాగు ఖర్చులు పెరగడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు.

దీంతో ఎల్లో మిర్చి సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఏడాది ఒక్క గుంటూరు జిల్లాలోనే వెయ్యి ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు రైతులు చెప్పారు. వ్యవసాయ ఖర్చులు పెరిగినప్పటికీ దిగుబడులు, ధర అధికంగా ఉండటంతో ఎల్లో మిర్చి సాగు చేసినట్లు తెలిపారు. మేడి కొండూరు మండలంలోని మందపాడు, విశదల, సిరిపురంల్లో అధికంగా సాగు చేశారు.

అధిక దిగుబడి.. ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. సాధారణ ఎర్ర మిర్చి 15 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తుండగా ఎల్లో మిర్చి సాగు చేస్తే ఎకరానికి పది క్వింటాళ్ల అధిక దిగుబడి వస్తుంది. మరొక వైపు సాధారణ ఎర్ర మిర్చి క్వింటా ధర పది వేల నుండి ప్రారంభమయి 20 వేల రూపాయలు వరకూ పలుకుతుంది. అదే ఎల్లో మిర్చి అయితే ప్రారంభ ధరే 25 వేల రూపాయలు ఉంటుంది.

గతంలో అత్యధికంగా క్వింటా 50 వేల రూపాయల ధర కూడా పలికింది. అయితే సాధారణ మిర్చి సాగు ఖర్చుతో పోల్చితే ఎకరానికి పది వేల రూపాయల వరకూ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ రైతులు మాత్రం ఎల్లో మిర్చి సాగు చేస్తే లాభాలు వస్తాయన్న ఆశతో మక్కువ చూపుతున్నారు. ఎర్ర మిర్చి సాగు ఏవిధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎల్లో మిర్చి సాగు కూడా ఉంటుంది. చీడపీడల బెడద కూడా తక్కువుగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.

మొత్తం మీద ఘాటైన ఎరుపు మిర్చికి పేరు గాంచిన గుంటూరు జిల్లాలో పసుపు రంగు మిర్చి సాగు పెరుగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎల్లో మిర్చిపైనే ఉంది. రానున్న రోజుల్లో ఈ మిర్చి సాగు అధికంగా ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ధరలు తగ్గకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తులు తీసుకున్నప్పుడే సాగుదారులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.