
గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు: మీరు తరచుగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే కాల్చిన పల్లీలను అస్సలు తినకండి. వేరుశెనగలో ఫైబర్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి పొట్ట ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడి కడుపులో అసౌకర్యం, ఎసిడిటీ పెరుగుతాయి.

లివర్, పిత్తాశయ సమస్యలు: పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు లేదా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేరుశెనగలకు పూర్తిగా దూరంగా ఉండాలి. పల్లీలలో నూనె శాతం చాలా ఎక్కువ. ఈ అధిక కొవ్వులను మెటబాలైజ్ చేయడానికి లివర్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించి ఫ్యాటీ లివర్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

థైరాయిడ్ బాధితులు జాగ్రత్త: థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేయించిన వేరుశెనగలను చాలా పరిమితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి. ఎందుకంటే వేరుశెనగలలో గోయిట్రోజెన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో అయోడిన్ శోషణను అడ్డుకుని, థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం: డయాబెటిస్ లేదా షుగర్ ఉన్నవారు మార్కెట్లో దొరికే వేయించిన, ఉప్పు-కారం కలిపిన లేదా తీపి పూత పూసి వేరుశెనగలను అస్సలు ముట్టకూడదు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. పల్లీలలో ఉండే అధిక క్యాలరీల వల్ల బరువు పెరిగి, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

ప్రాణాంతకమైన అలెర్జీలు: చాలా మందికి వేరుశెనగలు పడవు. పల్లీలు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు రావడం, దురద పెట్టడం, పెదవులు వాడటం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తినడం ఆపేయాలి. కొన్నిసార్లు పీనట్ అలెర్జీ ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది.

ఎలా తినాలి: వేరుశెనగలను నేరుగా కాల్చుకుని తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. నానబెట్టడం వల్ల వాటిలోని టాక్సిన్స్ తొలగిపోయి, జీర్ణక్రియ సులభమవుతుంది. అతిగా తింటే శరీరంలో వేడి పెరగడం, బరువు పెరగడం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.