
పాలకూర ఉల్లి కారం ఒక సాంప్రదాయ, రుచికరమైన వంటకం. ఇది అన్నంలోకి, చపాతీలోకి అద్భుతంగా సరిపోతుంది. ఆకుకూరలు ఇష్టపడని వారికి కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. దీన్ని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది.

కావాల్సిన పదార్థాలు.. పాలకూర కట్టలు – 3 (మధ్యస్థ సైజువి), ఉల్లిపాయలు – 3 (మధ్యస్థ సైజువి), వెల్లుల్లి – 1 (మధ్యస్థ సైజుది, పాయలుగా విడదీసి), కారం – 1 టేబుల్‌స్పూన్ (మీ కారానికి తగ్గట్టు), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 3-4 టేబుల్‌స్పూన్లు, పోపు దినుసులు – 1 టేబుల్‌స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిర్చి – 3 (చిన్న ముక్కలుగా తుంచి), కరివేపాకు – 1 రెమ్మ, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్ (వేయించినది), జీలకర్ర పొడి – 1/4 టీస్పూన్ (వేయించినది).. చొప్పున తీసుకోవాలి.

ముందుగా పాలకూర కట్టలను మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. మట్టి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కడిగిన పాలకూర ఆకులను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కాడలు ఉంటే తీసేయాలి, లేత కాడలను మాత్రమే ఉపయోగించాలి. పాలకూర సన్నగా తరిగితే ఉల్లి కారంలో బాగా కలిసిపోతుంది. తరిగిన పాలకూరను ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మూడు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పాయలుగా విడదీసిన వెల్లుల్లి (పొట్టు తీయకుండా వేసుకోవచ్చు), 1 టేబుల్‌స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, అక్కడక్కడా ఉల్లిపాయ పలుకులు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే రుచి మరింత బాగుంటుంది.

స్టవ్ పైన ఒక పాన్ పెట్టి, అందులో మూడు నుంచి నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక, 1 టేబుల్‌స్పూన్ పోపు దినుసులు వేసి, ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు వేగిన తర్వాత, తుంచిన ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లి కారాన్ని పాన్‌లో వేసి, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఉల్లి కారం బాగా వేగి, నూనె పైకి తేలే వరకు వేయించడం చాలా ముఖ్యం. ఉల్లి కారం సరిగా వేగకపోతే రుచి అంత బాగుండదు. సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాలు పట్టవచ్చు.

ఉల్లి కారం బాగా వేగిన తర్వాత, తరిగి పెట్టుకున్న పాలకూరను వేసి, ఉల్లి కారంతో బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి, పాన్‌కి మూత పెట్టి పాలకూర మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా మూత తీసి కలుపుతూ ఉండాలి. పాలకూర బాగా మగ్గి, నూనె సైడ్స్ నుండి కొద్దిగా పైకి తేలుతుంది. ఈ సమయంలో కర్రీ కొద్దిగా అడుగంటినా రుచి బాగుంటుంది. పాలకూర మగ్గిన తర్వాత, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/4 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి, మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించినవి వాడితే రుచి మరింత పెరుగుతుంది. మసాలాలు కలిపిన తర్వాత, ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించి, వెంటనే స్టవ్ ఆపివేయాలి. ఇప్పుడు వేడివేడి పాలకూర ఉల్లి కారం సిద్ధంగా ఉంది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యితో, లేదా చపాతీ, రోటీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.