
వేసవిలో చెమటలు పట్టడం సహజం. మండే వేడిలో కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా చాలా మంది చెమటతో తడిసి ముద్దవుతూ ఉంటారు. చెమట కూడా శరీరానికి మేలు చేస్తుంది. శరీరంలోని కొన్ని వ్యర్థాలు చెమట ద్వారా కూడా తొలగించబడతాయి. అయితే రాత్రి సమయంలో అది కూడా ఫ్యాన్ తిరుగుతున్నా చెమటతో తడిచిపోతుంటే జాగ్రత్త సుమా అంటున్నారు నిపుణులు.

రక్తంలో థైరాయిడ్ హార్మోన్ పరిమాణం పెరిగితే ఈ సమస్య రావచ్చు. హైపర్ థైరాయిడిజం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది చెమటను కలిగిస్తుంది.

హైపర్ హైడ్రోసిస్ అనేది శరీరం సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పట్టే పరిస్థితి. ఈ వ్యాధి ఉన్నవారికి దాదాపు ఎల్లప్పుడూ చెమటలు పడుతూనే ఉంటాయి. ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావచ్చు.

రక్తంలో చక్కెరలో అకస్మాత్తుగా తగ్గుదల చెమట సమస్యలను కలిగిస్తుంది. షుగర్ ఎక్కువగా ఉన్నా కూడా విపరీతంగా చెమటలు పడతాయి.

అధిక ఆందోళన సమస్యలతో బాధపడేవారికి ఈ రకమైన సమస్య ఉండవచ్చు. ఆందోళన కారణంగా హృదయ స్పందన రేటు పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు.

మెనోపాజ్ దగ్గరకు వచ్చే సమయంలో స్త్రీలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. అది ఈ సమస్యకు కారణం కావచ్చు.