
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో గణపయ్యకు ఆధార్ కార్డు, పాన్ కార్డు సిద్ధమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా నాగిరెడ్డి పల్లిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం ఇప్పుడు స్థానికులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా లోను హల్చల్ చేస్తోంది.

సాధారణంగా ప్రతి యేటా వినాయక చవితి అంటే భారీ సెట్టింగులతో మంటపాలు తీర్చి దిద్దుటుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తుంటారు. పూల పరిమళాలతో గణపయ్యను పూజిస్తుంటారు. కానీ నాగిరెడ్డిపల్లి యువత ఇందుకు భిన్నంగా ఆలోచించారు.

గణపయ్యకు ఆధార్ కార్డు పాన్ కార్డు తయారు చేశారు. పేరు గణేష్ తండ్రి పేరు శివుడు చిరునామావద్ద చిరునామా కూడా కైలాసం కాకుండా మదర్ తెరిసా వీధి నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలూరు మండలం అంటూ ఏకంగా అడ్రస్ క్రియేట్ చేశారు.

ఇక పాన్ కార్డు కూడా సరే సరి.. వినాయక మండపానికి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించడమే కాకుండా గణపయ్య ఆధార్ కార్డు చూసి నవ్వుకోవడం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లో పోటీ పడుతున్నారు. దీంతో ఘనపయే ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. వినాయక చవితి వేడుకల్లో భక్తి సాధారణమే. కానీ భక్తితో పాటు తమ క్రియేటివిటీని జోడించి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారు నాగిరెడ్డిపల్లి యువత.

చిన్న ఆలోచన పెద్ద నవ్వు తెప్పించడమే కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది. మొత్తానికి గణపయ్య కైలాసం నుంచి నాగిరెడ్డి పల్లెకు రావడమే కాకుండా ఏకంగా తన శాశ్వత చిరునామాను నందలూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నాడు అని భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కుకొని చిరునవ్వుతో సెల్ఫీలు తీసుకున్నారు.