
రంగును బట్టి నాణ్యత: మటన్ కొనేటప్పుడు రంగు చాలా ముఖ్యం. మాంసం లేత గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటే అది తాజాది, లేతది అని అర్థం. ఒకవేళ ముదురు ఎరుపు రంగులో ఉంటే అది ముదురు జీవమని, పసుపు లేదా గోధుమ రంగులోకి మారితే అది నిల్వ ఉంచిన మాంసమని గుర్తించాలి. తాజా మాంసం అస్సలు దుర్వాసన రాదు.

మేక మాంసం vs గొర్రె మాంసం: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గొర్రె కంటే మేక మాంసం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఐరన్, విటమిన్ బి12, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి మేక మటన్ సరైన ఎంపిక.

ఏ వంటకానికి ఏ భాగం:వంటకాన్ని బట్టి మాంసం భాగాన్ని ఎంచుకోవడం ఒక కళ. మెడ భాగం చాలా మృదువుగా ఉంటుంది. కూరలు, పలావ్ వంటి వాటికి ఇది బెస్ట్. చెస్ట్, వీపు వంటి భాగాలు గ్రేవీ వంటకాలు, మటన్ ఫ్రైలకు మంచి రుచిని ఇస్తాయి. తొడ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అయితే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి సమయం పడుతుంది.

వండేటప్పుడు ఇవి మర్చిపోవద్దు: మటన్ తెచ్చిన వెంటనే ఉప్పు, కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడగాలి. మాంసం త్వరగా ఉడకాలంటే ఉడికించే సమయంలో చిన్న పచ్చి బొప్పాయి ముక్క లేదా కొద్దిగా పెరుగు కలిపి మేరినేట్ చేస్తే ముక్క వెన్నలా కరుగుతుంది.

మితంగా తింటేనే హితం: మటన్ రుచిగా ఉందని అతిగా తినకూడదు. పండుగ రోజుల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు ఇబ్బంది కలగకుండా మితంగా తీసుకోవడమే ఆరోగ్యకరం.