
రాజకీయాల్లో ఎప్పుడు.. ఎలా.. ఏమి.. జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అద్భుతాలు, సంచలనాలు జరుగుతాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు అసామాన్యులు అయ్యారు.

సత్తుపల్లి మున్సిపాలిటీ లో నిన్నటి వరకు కార్మికుడు గా పని చేసిన సామాన్యుడు నేడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి అడుగు పెట్టాడు. మున్సిపాలిటీ ఎన్నికలు ఒక కార్మికుడు తల రాతను మార్చాయి.

మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న ఒక యువకుడు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ లోని 09 వ వార్డు ఎస్టీ రిజర్వుడు కావడంతో మున్సిపాలిటీలో పంపు ఆపరేటర్ గా పని చేస్తున్న జగన్నాథం శ్రీనివాసరావు కు కాంగ్రెస్ పార్టీ తరుపున స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి టికెట్ ఇవ్వడంతో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందాడు.

తాను కార్మికుడు గా పని చేసే మున్సిపాలిటీ లో కౌన్సిలర్ గా అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని, తనకు కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కి విధేయుడుగా ఉంటూ...తన వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.