
కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు, ఒకటి - ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు - ముక్కలుగా తరిగిన వంకాయలు, రెండు - మీడియం సైజు టమాటాలు, రెండు - చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు - చీలికలు పచ్చిమిర్చి, రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

తాలింపు కొరకు: ఒక టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఇంగువ, రెండు ఎండుమిర్చి, ఆరు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు. కుక్కర్‌లో 100 గ్రాముల కందిపప్పును తీసుకుని నీటితో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. అందులో పప్పు మునిగేంత నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ నూనె వేసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ప్రెజర్ పోయిన తర్వాత పప్పుగుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మెదిపిన పప్పులో తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శుభ్రం చేసిన ములక్కాయ ముక్కలు, వంకాయ ముక్కలు మరియు అర గ్లాసు నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో సరిగ్గా ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల కూరగాయ ముక్కలు పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి, చిదిమిపోవు.

పప్పుచారు మరిగించడం, తాలింపు: ఉడికిన కూరగాయల మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం, చింతపండు రసం మరియు ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. మీడియం మంటపై 10 నిమిషాల పాటు పప్పుచారును బాగా మరగనిచ్చి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ మీద పాన్ పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి. ఈ వేగిన తాలింపులో పక్కన ఉంచిన పప్పుచారును పోసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి చిన్న మంటపై మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మని ములక్కాయ పప్పుచారు సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆస్వాదిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!