
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రహదారలన్నీ చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కావడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

ఢిల్లీలోని శనివారం 126.1 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఆ రాష్ట్రంలో ఒకే రోజులో ఇంత స్థాయిలో భారీ వర్షం కురవడం ఇరవై ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అక్కడ చివరిసారి 2003లో జులై 10వ తేదీన 133.4 మిల్లీలీటర్ల వర్షం కురిసింది.

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ- కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తు్న్నాయి. హిమచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 5 గురు మృతి చెందారు. అధికారులు అక్కడ ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ కారు.. గంగా నదిలో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. ఇక్కడ నైనిటాల్‌లో భారీ వర్షాలకు వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

పంజాబ్, యూపీలోని వారణాసిలో కూడా భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్థంభించింది. రాజస్థాన్‌లో వర్షాల వల్ల గత 24 గంటల్లో నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.