
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వల్ల ఆర్థిక సమృద్ధి, సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు. అయితే, ఈ మొక్కను ఇంటి లోపల ఉంచాలా లేదా ఇంటి బయట పెంచాలా అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి లోపల పెంచడమే శ్రేయస్కరం. ఈ మొక్కను ఇంటి బయట నాటడం వల్ల ఇతరుల కంటి చూపు పడి, దాని ప్రభావం ఇంటి ఆర్థిక స్థితిపై పడుతుందని శాస్త్రం చెబుతోంది. మనీ ప్లాంట్ ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికి పాటించాల్సిన వాస్తు నియమాలు తప్పనిసరి!

ఇంటి లోపల ఉంచడమే అత్యుత్తమం: వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి లోపల మాత్రమే పెంచాలి. దీనిని ఇంటి బయట లేదా వరండాలో అందరికీ కనిపించేలా ఉంచకూడదు. ఎందుకంటే, బయట ఉంచడం వల్ల ఇంటికి వచ్చే వెళ్లే వారి దృష్టి (దిష్టి) ఈ మొక్కపై పడుతుంది. వాస్తు ప్రకారం, ఇతరుల ప్రతికూల దృష్టి మనీ ప్లాంట్‌పై పడితే అది ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొక్క ఎండిపోతే ఇంటి ఆర్థిక స్థితి దెబ్బతింటుందని, ధన నష్టం సంభవిస్తుందని నమ్ముతారు. కాబట్టి దీనిని లివింగ్ రూమ్ లేదా పూజా గది సమీపంలో ఇండోర్ ప్లాంట్‌గా పెంచడం మంచిది.

సరైన దిశ ఏది?: మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచేటప్పుడు దిశ చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం, ఈ మొక్కను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశకు అధిపతి వినాయకుడు, అలాగే శుక్ర గ్రహం ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పొరపాటున కూడా మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశ లో ఉంచకూడదు, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది.

మనీ ప్లాంట్ తీగలు ఎల్లప్పుడూ పైకి వెళ్లేలా తాడు లేదా స్టిక్ సహాయం అందించాలి. తీగలు కింద నేలపై పాకడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మొక్కలోని ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా ఎండిపోయినా వాటిని వెంటనే కత్తిరించాలి. ఎండిన ఆకులు పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.

ఒకవేళ మనీ ప్లాంట్‌ను మట్టిలో కాకుండా గాజు సీసాలో నీళ్లలో పెంచుతుంటే, వారానికి ఒకసారి ఆ నీటిని తప్పకుండా మార్చాలి. ఈ చిన్నపాటి వాస్తు నియమాలను పాటించడం ద్వారా మనీ ప్లాంట్ మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది.